ఉద్యోగ సంఘాలతో మంత్రుల భేటీ : సీపీఎస్ - రుణాలపై క్లారిటీ..!!
ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం అందింది. సమావేశానికి రావాలంటూ ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది. ప్రస్తుతం సీపీఎస్ రద్దు - ప్రభుత్వం ఉద్యోగుల తరపున వాటా సొమ్ముల పైన రుణాలు తీసుకుంటుందనే చర్చ నడుమ ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో ప్రధానంగా సీపీఎస్ రద్దు, జీపీఎస్ ప్రతిపాదనల అంశంపై మరోమారు సమావేశంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. పీఆర్సీ ఖరారు సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం..ఈ సాయంత్రం ఆహ్వానించిన ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతోంది.
ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పీఆర్సీ అంశాలతో పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పేర్కొన్న పెండింగ్ డిమాండ్లపై చర్చించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఎన్నికల వేళ సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి..ఇప్పుడు దీని స్థానంలో జీపీఎస్ ప్రతిపాదను తెర మీదకు తీసుకొచ్చారు. దీని పైన ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రం పైన భవిష్యత్ ఆర్దిక భారం పడకుండా.. ఉద్యోగులకు నష్టం లేకుండా ఈ విధానం తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, తాజాగా.. రాజ్యసభలో కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలు ఈ సమావేశంలో కీలకంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్ కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి కొత్త రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి పొందిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో...ఉద్యోగ సంఘాల నేతలకు ఈ వ్యవహారం పైన పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications