ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు-సామాజిక సేవ శిక్ష ఖరారు
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు గతంలో హైకోర్టు విధించిన శిక్షపై దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్ ను కొట్టేస్తూ ఇవాళ తీర్పునిచ్చింది. దీంతో ఆమెకు ఆ శిక్ష ఖరారైనట్లయింది.
గతేడాది ఏపీలోని స్కూళ్లలో సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎనిమిది మంది ఐఏఎస్ లు అమలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఈ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు వాటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ఏడాది పాటు అధికారులు వాటిని తొలగించలేదు. దీంతో మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. రెండు వారాల జైలుశిక్ష తో పాటు జరిమానా కూడా విధించింది. దీనిపై వారు హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. దీంతో హైకోర్టు ఈ శిక్షను మార్చి ఏడాది పాటు సామాజిక సేవ చేయాలని శిక్ష విధించింది.

హైకోర్టు విధించిన సామాజి సేవ శిక్షపై ఈ ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన శ్రీలక్ష్మి హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చింది. గతంలో విధించిన సామాజిక సేవ శిక్షపై పునరాలోచన చేసేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఆమె కచ్చితంగా ఏడాది పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక ఐఏఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది కూడా తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications