బిగ్ బాస్ 6లో ప్రెగ్నెన్సీ టెస్ట్ లు ? పిటిషన్ ప్రచారంలో భాగమేనా ? షో చూశాక తేలుస్తామన్న హైకోర్టు..
టాలీవుడ్ హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 6లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారం కోసం ఈ షో నిర్వాహకులైన మాటీవీ యాజమాన్యం అడ్డదారులు తొక్కుతోందని ఆరోపిస్తూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోలో గర్భధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరారు.

బిగ్ బాస్ షో వివాదాలు
స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో పై ఆది నుంచీ అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా సీపీఐ జాతీయనేత నారాయణ దీన్నో బ్రోతల్ హౌస్ గా అభివర్ణిస్తూ ఎప్పటినుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా మిగతా వారు మాత్రం సైలెంట్ గా ఉండటంతో ఈ షో సజావుగా సాగిపోతోంది. కానీ తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి బిగ్ బాస్ షో సీజన్ 6పై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ షో ద్వారా హింస, అశ్లీలం, అసభ్యత ప్రోత్సహిస్తున్నారని పిటిషనర్ కేతిరెడ్డి ఆరోపిస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రెగ్నెన్సీ టెస్టులు ?
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తాజాగా మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ కేతిరెడ్డి న్యాయవాది పలు అంశాల్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందులో బిగ్ బాస్ హౌస్ లో గర్భధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. అసలే అక్కడ మెరీనా, రేవంత్ రూపంలో ఇద్దరు దంపతులు ఉన్నారు. దీంతో ఈ టెస్టులు మెరీనాకు నిర్వహించారా లేక అక్కడున్న మిగతా ఆడవాళ్లకూ నిర్వహించారా అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

షోకు సెన్సార్ ఏదీ ?
బిగ్ బాస్ షోను సెన్సార్ చేయకుండా యథాతథంగా టీవీల్లో ప్రసారం చేయడంపైనా పిటిషనర్ కేతిరెడ్డి అభ్యంతరాలు తెలిపారు. అలాగే ఇలాంటి షోలను వాస్తవంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా స్టార్ మాలో రాత్రి 9 గంటలకే ప్రసారం చేస్తున్నట్లు కూడా పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
పిటిషనర్ అభ్యంతరాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ షో ప్రసారం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

బిగ్ బాస్ చూస్తామన్న న్యాయమూర్తులు
బిగ్ బాస్ షో ద్వారా హింస, అశ్లీలం, అసభ్యత వ్యాప్తి చేస్తున్నారన్న పిటిషనర్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విచారిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మరో న్యాయమూర్తి జస్టిస్ డీవీవీఎస్ సోమయాజులు ఈ షో చూడాలని నిర్ణయించారు. ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు ఒకట్రెండు ఎపిసోడ్ లు చూస్తామని హైకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి వచ్చేందుకు అవకాశం ఉంటుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

వివాదాలు ప్రచారం కోసం కాదుగా ?
విచారణ సందర్భంగా మరో అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. పిటిషనర్ కేతిరెడ్డి ప్రచారం కోసం ఈ పిటిషన్ వేయలేదు కదా అని హైకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. దీనికి బదులుగా అబ్బే లేదంటూ ఆయన న్యాయవాది బదులిచ్చారు. అయితే ఈ షో ప్రచారంలో భాగంగా ఏమైనా పిటిషన్ వేశారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హైకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. ఈ మధ్య ప్రచారం కోసం నిర్వాహకులే వివాదాలు సృష్టిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఒకట్రెండు ఎపిసోడ్ లు చూస్తామని చెప్తున్నామని, ఆ తర్వాతే ఓ అవగాహనకు వస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.












Click it and Unblock the Notifications