కాదంబరి జెత్వానీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో తీవ్ర కలకలం రేపిన ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత విద్యాసాగర్ పై కాదంబరి చేస్తున్న ఆరోపణలు, దానిపై మీడియాలో జరుగుతున్న చర్చలు అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కాదంబరి చేస్తున్న ఆరోపణలపై మీడియాలో జరుగుతున్న చర్చలను అడ్డుకునేందుకు హైకోర్టు తక్షణ ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై ఇబ్రహీంపట్నం పీఎస్ లో తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ కాదంబరీ జెత్వానీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీఐడీ విచారణకు రంగం సిద్దం చేస్తోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం పీఎస్ లో పెట్టిన కేసు సరైనదా కాదా తేల్చేందుకు విజయవాడ సీపీ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం పీఎస్ లో దాఖలైన కేసు వాస్తవికతను తేల్చేందుకు ఏసీపీ శ్రవంతీ రాయ్ బృందం ప్రయత్నిస్తోంది. ఇది జరుగుతున్న క్రమంలో దీనికి సమాంతరంగా మరో విచారణకు ప్రభుత్వం ఆదేశించకుండా అడ్డుకోవాలని విద్యాసాగర్ హైకోర్టును కోరారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు..ముందుగా కాదంబరీ జెత్వానీ కేసులో గతంలో సేకరించిన ఆధారాలను వచ్చే విచారణ వరక భద్రపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 11న జరిగే తదుపరి విచారణలో వీటి ఆధారంగా మరో దర్యాప్తు అవసరమా లేదా అనేది హైకోర్టు తేల్చబోతోంది. ఒక వేళ హైకోర్టు ఇబ్రహీంపట్నం పీఎస్ లో ఉన్న కేసు విచారణకు సమాంతరంగా మరో విచారణ ప్రభుత్వం చేసుకోవచ్చని తేలిస్తే మాత్రం ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో హైకోర్టు నిర్ణయం కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications