
ఇళ్ల స్ధలాలపై జగన్ సర్కార్ అప్పీలు-హైకోర్టు కీలక నిర్ణయం-దసరా సెలవుల తర్వాతే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్ధలాల సైజు విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది. అయితే హైకోర్టు కేటాయించిన డివిజన్ బెంచ్ లో గతంలో తీర్పు ఇచ్చిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తే ఉండటంతో దీనిపై రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదలకు ఇళ్ల పథకంలోని లోపాల్ని ప్రస్తావించిన జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి .. వాటిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసేంతవరకు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అప్పీల్ చేసింది. దసరా సెలవుల ప్రత్యేక ధర్మాసనం జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి , జస్టిస్ ఆర్.రఘునందన్ రావులతో కూడిన బెంచ్ ముందుకు అప్పీల్ విచారణకు వచ్చింది.

ఇళ్ల స్ధలాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఆర్.రఘునందన్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే
ఇళ్ల పథకంపై తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఈ బెంచ్‌లో ఉండటంతో దర్మాసనం ఈ అప్పీలు విచారణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ ను ఎవరికి కేటాయించాలనే దానిపై నిర్ణయాన్ని ఛీఫ్ జస్టిస్ కే వదిలిపెట్టింది. పేదలందరికీ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను తగిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని కొత్త ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ముందు ఉంచాలని రిజిస్ట్రీని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
Recommended Video
ఈ లెక్కన చూస్తే దసరా సెలవుల తర్వాతే ఇళ్ల స్దలాల కేసు అప్పీలు విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా సెలవుల ప్రత్యేక ధర్మాసనంలో గతంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఉండటంతో.. సెలవుల తర్వాత మరో డివిజెన్ బెంచ్ కు ఛీఫ్ జస్టిస్ ఈ పిటిషన్ ను కేటాయించే అవకాశముంది.