రుయా ఆస్పత్రిలో మరణాలపై హైకోర్టు ఫైర్- ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
తిరుపతి రుయా ఆస్పత్రిలో తాజాగా ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు చనిపోయిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రుయాలో ఆక్సిజన్ అందక 36 మంది చనిపోతే 11 మందే చనిపోయారని ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ పీఆర్ మోహన్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు సీరియస్ అయింది.
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక కోవిడ్ రోగులు చనిపోయిన ఘటనపై టీడీపీ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, దీనికి బాధ్యులైన ప్రతీ ఒక్కరిపై కేసు నమోదు చేయాలని వారు హైకోర్టు బెంచ్‌ను కోరారు. దీనిపై న్యాయవిచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేవలం ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఐదు ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చినా ఇప్పటివరకూ వాటిని రాష్ట్రంలో నెలకొల్పలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై తమ స్పందన తెలియజేయాలంటూ నోటీసులు ఇచ్చింది. అయితే కోర్టుకు వేసవి సెలవులు కావడంతో విచారణ వాయిదా పడింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఈ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.
తిరుపతి రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న మరణాలు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. భారీ ఎత్తునకోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక చనిపోవడంతో కేంద్రం కూడా దీనిపై స్పందించింది. ఏపీకి అదనపు ఆక్సిజన్ కేటాయిస్తున్నట్లు తెలిపింది. రుయా ఘటనకు తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఆలస్యం కావడమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్రాల స్పందన కోరుతూ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications