YS Viveka Case: షర్మిల, సునీత, బీటెక్ రవిపై హైకోర్టు సీరియస్-కడప కోర్టుకు కీలక ఆదేశం..!
ఏపీలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు, సీబీఐ దర్యాప్తు, అందులో బయటపడిన అంశాలు ఎన్నికల అంశంగా మారిపోయిన నేపథ్యంలో తాజాగా కడప కోర్టు ఈ వ్యవహారంపై మాట్లాడొద్దంటూ వివేకా కుమార్తె సునీత, వైఎస్ షర్మిల, బీటెక్ రవి, చంద్రబాబు, పవన్, పురందేశ్వరికి ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సునీత, షర్మిల, బీటెక్ రవి అప్పీలు చేసినా వెంటనే విచారణ జరగలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలిచ్చింది.
వివేకా కేసుపై తాము మాట్లాడకుండా కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీలు చేసుకున్నా వెంటనే విచారణ జరపకపోవడంపై హైకోర్టులో సునీత, షర్మిల, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు రెండు బెంచ్ లు నిరాకరించి తప్పుకున్నాయి. దీంతో ముచ్చటగా మూడో బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఈ నెల 8వ తేదీలోకా తేల్చాలంటూ కడప కోర్టుకు గడువు ఇచ్చింది.

మరోవైపు ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు సునీత, షర్మిల, బీటెక్ రవికి అక్షింతలు వేసింది. కోర్టు ముందు పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారని వీరిని ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అడిగింది.కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని నిలదీసింది. అంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారని ప్రశ్నించింది. హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారని అడిగింది. అలా చెప్పటం తప్పు కాదా అని ఆక్షేపించింది. ఇలా చెప్పటం నేరపురితమైన చర్యలు కిందకు రాదా అని కూడా అడిగింది. అలాగే ఐదేళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షర్మిల ఆక్షేపించింది.
కడప కోర్టులో ఇప్పటికే అప్పీలు పిటిషన్లు దాఖలు చేసుకున్న నేపథ్యంలో హైకోర్టులో వీటిపై విచారణ అవసరం లేదని భావిస్తూ దీన్ని ముగించింది. దీంతో ఇప్పుడు బంతి తిరిగి కడప కోర్టులోకే వెళ్లింది. హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు మరో ఐదు రోజుల్లో ఈ వ్యవహారంపై సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఏపీలో ఎన్నికల ప్రచారం ఈ నెల 11తో ముగియనుంది. కాబట్టి కడప కోర్టు సానుకూల ఆదేశాలు ఇస్తే ఆ మూడు రోజుల్లో ప్రచారంలో వివేకా కేసు ప్రస్తావించేందుకు షర్మిల, సునీతకు వీలు దొరుకుతుంది.












Click it and Unblock the Notifications