ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం ! ఎన్నికల వేళ ఆ ఎంపీ, ఎమ్మెల్యేలకు భారీ షాక్..!
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైకోర్టు పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వారిపై నమోదైన కేసుల సత్వర విచారణ విషయంలో హైకోర్టు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు కళంకిత ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పట్టించేలా ఉంది. ఇందులో ఏ ఒక్క కేసులో అయినా వీరు దోషిగా తేలితే ఎన్నికలకు పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉండటమే దీనికి కారణం.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులపై గతంలో నమోదైన కేసుల విచారణ నత్తనడక నడుస్తోందన్న ఫిర్యాదులపై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. వీటి వ్యవహారం వెంటనే తేల్చాలని దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర క్రిమినల్ కేసుల్లోనూ విచారణల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకోవడంపై హైకోర్టులకు అక్షింతలు వేసింది. హైకోర్టులో ఈ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు స్పందించింది.

రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరిపైనా నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసే దిశగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కేసుల సత్వర విచారణపై ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా సుమోటోగా ప్రజాప్రయోజన వాజ్యం నమోదు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ జరిపి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు తగిన ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ పిల్ లో ప్రతివాదులుగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుతో పాటు సీఎస్, డీజీపీ, హైకోర్టు పీపీని కూడా చేర్చింది.
రెండు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రజాప్రతినిధులపై కేసుల్లో విచారణను వేగవంతం చేసి తీర్పులు ఇవ్వడం మొదలుపెడితే ఆ ప్రభావం కచ్చితంగా ఇప్పటికే కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. వాటిలో కనీసం రెండేళ్ల శిక్ష పడితే ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు కావడం ఖాయం. దీంతో హైకోర్టు తీసుకోబోయే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications