Borugadda Anil: బోరుగడ్డకు పోలీసుల షాక్- హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయనపై నమోదైన పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో గడుపుతున్న నేపథ్యంలో తల్లి అనారోగ్యం కారణంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే సకాలంలో రాజమండ్రి జైల్లో ఆయన తిరిగి లొంగిపోకపోవడంతో ప్రభుత్వానికి మరో అస్త్రం దొరికినట్లయింది.
ఈ నేపథ్యంలో పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ పై హైకోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి జైల్లో సకాలంలో ఎందుకు లొంగిపోలేదో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో బోరుగడ్డ ఇరుకునపడ్డారు. వాస్తవానికి బోరుగడ్డ లొంగిపోవాల్సిన తేదీ సాయంత్రం లొంగిపోకుండా ఆ తర్వాత రోజు ఉదయం రాజమండ్రి జైలుకు వచ్చి సరెండర్ అయ్యారు. దీంతో రాజమండ్రి జైలు అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ విచారణ సందర్భంగా బోరుగడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని దాని ఆధారంగా మధ్యంతర బెయిల్ గడువు పొడిగించుకున్నారంటూ పోలీసులు చేసిన ఆరోపణలపై సీల్డ్ కవర్ లో ఆధారాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లి అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చిన వ్యవహారంలో డాక్టర్ వివరాలు, ఇతర పత్రాలు సమర్పించేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications