అమరావతి తీర్పు ధిక్కార పిటిషన్-జగన్ సర్కార్ ను స్టేటస్ రిపోర్ట్ కోరిన హైకోర్టు
ఏపీ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. ఇందులో హైకోర్టు తీర్పును ఆక్షేపిస్తూ సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలుకూడా చేశారు. అనంతరం హైకోర్టు తీర్పు అమలు చేయడం కష్టమంటూ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అదే సమయంలో అమరావతిలో పనులూ నిలిపేశారు. దీంతో రైతులు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. రైతుల దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా వాస్తవాలు తెలుసుకునేందుకు వీలుగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పనుల పురోగతి తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆరునెలల్లో రాజధాని పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే పనులు మొదలైతే ఆ మేరకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ పనులు మొదలు కాకపోతే మాత్రం హైకోర్టుకు ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా పనుల పురోగతి తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను జూలై 12కు వాయిదా వేసింది. రైతులు తమ పిటిషన్లో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. నిధుల సాకుతో ప్రబుత్వం పనులు వాయిదా వేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్ధానం వాస్తవ పరిస్దితి తెలుసుకున్నాక స్పందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వాయిదా లోపు తీసుకోబోయే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications