చంద్రబాబు జైల్లో గడిపిన బ్లాక్ కు హోంమంత్రి అనిత-తల్చుకుని ఎమోషనల్...!
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ సీఎం చంద్రబాబు గతంలో స్కిల్ స్కాంలో అరెస్టు అయినప్పుడు గడిపిన రాజమండ్రి జైల్లోని స్నేహ బ్లాక్ కు వెళ్లారు. జైళ్లలో పరిస్ధితుల్ని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిన అనిత.. చంద్రబాబు సదరు బ్లాక్ లో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకొని చలించిపోయారు. ఆ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ భద్రత తగ్గింపుపై వస్తున్న విమర్శలపైనా అనిత స్పందించారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఇవాళ ఖైదీల సౌకర్యాలు పరిశీలించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాక ఎమోషనల్ అయ్యానని వెల్లడించారు. తమ అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకుండా 53రోజులు రాజమండ్రి ఇదే జైల్లో ఉంచారని గుర్తుచేసుకున్నారు. ఇవాళ పరిస్థితులు తారుమారయ్యాయని తెలిపారు. వైసీపీ పాలనలో తమ అధినేతను ఎన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తుచేసుకుంటే బాధ కలుగుతోందన్నారు. అనంతరం రాజమండ్రి జైల్లో పరిస్ధితులపై అధికారులను ఆరా తీశారు. అలాగే జైలు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు వైఎస్ జగన్ సెక్యూరిటీ తగ్గింపుపై స్పందిస్తూ.. తాము భద్రత తగ్గించలేదని వంగలపూడి అనిత వెల్లడించారు.
భద్రత కుదించారని జగన్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని
జగన్ భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో 20 వేల మంది పోలీసులు కొరత ఉంటే జగన్ కు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలా? అని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications