పవన్ పేషీ బ్లాక్ లో అగ్నిప్రమాదం జరిగిందిలా..రీజన్ చెప్పిన హోంమంత్రి..!
ఇవాళ ఉదయం సచివాలయంలోని బ్లాక్ 2లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి అనిత, ఇతర మంత్రులు ఉండే కీలకమైన బ్లాక్ లో ఈ ప్రమాదం జరగడం చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదం వెనుక ఏం జరిగిందన్న దానిపై వెంటనే సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి అలర్ట్ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత.. ఆ తర్వాత నేరుగా ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
సచివాలయం రెండో బ్లాక్ వద్ద బ్యాటరీలో ఉండే గదిలో ఈ ఉదయం జామున ఆరున్నర గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలో ఉండే ఎస్పీఎఫ్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారన్నారు. మొత్తం 8 నిమిషాల్లోనే మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు హోంమంత్రి తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె తెలిపారు. మంటల కారణంగా ఏసీలు, బ్యాటరీలు ధ్వంసం అయ్యాయని, పొగలు బ్లాక్ అంతా వ్యాపించాయన్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జీఎడీ వర్గాలు తెలిపినట్లు హోంమంత్రి వెల్లడించారు. ఏ విషయాన్నీ తాము లైట్ తీసుకోవడం లేదని తెలిపారు. ఫోరెన్సిక్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్, పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. సచివాలయం అంతా ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించి తదుపరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు.













Click it and Unblock the Notifications