ఏపీకి పగడాల హారం.. ఉత్తరాంధ్రలో అరుదైన పగడాల దిబ్బలు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పగడాల హారం మరో ఆభరణంలా నిలువబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలోని తీరం అద్భుతమైన సముద్ర జీవవైవిధ్యానికి నెలువుగా మారిందని, ఆ ప్రాంతాలలో అరుదైన పగడపు దిబ్బలు వృద్ధి చెందుతున్నాయని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది .ఇక ఈ అధ్యయన వివరాలను అంతర్జాతీయ జర్నల్ ఎన్విరాన్మెంట్ సైన్స్ ఆర్కైవ్స్ లో తాజాగా ప్రచురించడం ఏపీలో అరుదైన పగడపు దిబ్బలపైన అందరూ చర్చించుకునేలా చేస్తోంది.
ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు
రుషికొండ, పూడిమడక, మంగమారి పేట, చింతపల్లి తీరాలలో పగడపు దిబ్బలు అధిక సంఖ్యలో ఉన్నట్టు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అరుదైన సంపద వివరాలలోకి వెళితే అనకాపల్లి, విజయనగరం, విశాఖ తీరాలలోని నాలుగు ప్రాంతాలలో పదిహేను నమూనాల ఆధారంగా జరిపిన అధ్యయనంలో అరుదైన అందమైన పగడపు దిబ్బలను గుర్తించారు.

ఏపీలో అరుదైన సంపద
ఈ పగడపు దిబ్బలు సముద్రంలో కనిపించే ఒక రకమైన నిర్మాణాలు. చిన్న చిన్న జీవులైన పగడాల కాలనీలలో ఏర్పడతాయి. క్యాల్షియం కార్బోనేట్ తో ఏర్పడి నీటిలో మునిగిపోయిన రాతి లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి . వందల వేల చిన్న చిన్న పగడాల కాలనీలతో ఏర్పడే ఈ పగడపు దిబ్బలను ఈ ప్రాంతాలలో గుర్తించారు. సముద్ర జీవవైవిధ్యంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉన్న పగడపు దిబ్బలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం నిజంగా ఏపీకి అరుదైన సంపదగా చెప్పవచ్చు.
ఏపీ తీరంలో అరుదైన సంపదపై అధ్యయనం
మన రాష్ట్ర తీరంలో ఈ అరుదైన సంపదపైన 2019నుంచి 2023వరకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం కొనసాగించింది. అనేక ప్రదేశాలలో స్కూబా డైవింగ్, డిజిటల్ ఫోటోగ్రఫీ ఆధారంగా వివరాలను సేకరించింది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు డాక్టర్ రఘునాథన్, యోగేష్ కుమార్, తమల్ మండల్, ప్రదీప్ పండా, ఆర్యసేన్, స్కూబాడైవింగ్ నిపుణుడు బలరాంనాయుడు వీరి సాయంతో పరిశోధన చేసిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేక కొత్తవిషయాలను వెల్లడించింది.
ఎక్కడెక్కడ ఎంత శాతం పగడపు దిబ్బలు ఉన్నాయంటే
విజయనగరం జిల్లా చింతపల్లిలో 12, రుషికొండ లో ఆరు, అనకాపల్లి జిల్లా పూడిమడకలో 5, విశాఖ జిల్లా మంగమారి పేట వద్ద మూడు అరుదైన ప్రదేశాలను వీరు గుర్తించారు.
పగడపు దిబ్బలు చింతపల్లిలో 23%, ఋషికొండ వద్ద 20శాతం, పూడిమడకలో 15%, మంగమారి పేట వద్ద ఐదు శాతం విస్తరించినట్లు తేల్చారు .అధ్యయనంలో కొత్తగా 13 రకాల సీ స్లగ్స్, 11 రకాల చేప జాతులు, రెండు పీతరకాలను గుర్తించారు.
దేశంలో సముద్రంలో ఎక్కడా లేని వింటో మార్కెడెస్ తలాస్ నెస్ చేప
అంతేకాదు మన దేశ సముద్రంలో ఇప్పటివరకు కనిపించని వింటో మార్కెడెస్ తలాస్ నెస్ అనే చేప మన రాష్ట్ర పగడపు దీవుల్లో పెరుగుతున్నట్టు గుర్తించారు. సముద్ర జీవ వైవిధ్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగడపు దీవులు అద్భుతమైన ఆవాసంగా ఉన్నాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడయింది.












Click it and Unblock the Notifications