AP Liquor scam : మద్యం స్కాంలో 8 మంది నిందితులకు షాక్..! చెవిరెడ్డి సహా..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కాంపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ సిట్ అధికారులు తాజాగా ఈ కేసులో పురోగతి సాధిస్తున్నారు. అప్పట్లో మద్యం స్కాం డబ్బును దాచిన నిందితుల నుంచి ఆ డబ్బును చోరీ చేసిన వ్యవహారాన్ని ఛేదించడంతో పాటు నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల్ని జప్తు చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఈ కేసులో ఎనిమిది మంది నిందితులకు షాకిచ్చారు.
మద్యం స్కాం కేసులో నిందితులుగా ఉంటూ విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బూనేటి చాణక్య రిమాండ్ ముగియడంతో ఇవాళ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. అలాగే గుంటూరు జైలు నుంచి మరో ఇద్దరు నిందితులు నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్ ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో వీరి రిమాండ్ ను డిసెంబర్ 5 వరకూ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

గతంలో ఇదే కేసులో ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు డిఫాల్ట్ బెయిల్ పొందారు. వీరిని మినహాయించి మిగిలిన నిందితులకు ఇప్పుడు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఏసీబీ కోర్టు వారికి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో వారి రిమాండ్ పొడిగించలేదని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఆధారంగా సిట్ వారి రిమాండ్ కోరనుంది.












Click it and Unblock the Notifications