ఏపీ మద్యం స్కాం కేసులో కీలక పరిణామం- 13 కోట్ల ఆస్తుల జప్తు..!
ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కాంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇప్పటికే అరెస్టు అయి జైల్లో ఉన్న రాజ్ కెసిరెడ్డికి సీఐడీ సిట్ అధికారులు ఇవాళ షాకిచ్చారు. ఆయనకు చెందిన 13 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ స్కాంలో జప్తు చేసిన అతిపెద్ద మొత్తం ఇదేనని భావిస్తున్నారు.
గతంలో మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులతో ఈ కేసులో ఏ1 రాజ్ కెసిరెడ్డి కొనుగోలు చేసిన 13 కోట్ల ఆస్తుల్ని ఇవాళ సిట్ జప్తు చేసింది. అలాగే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు రాజ్ కెసిరెడ్డి వివిధ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టినట్లు సిట్ గుర్తించింది. వీటిపై కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిట్ రంగం సిద్దం చేస్తోంది. దీంతో మద్యం కేసులో ఏ1 రాజ్ కెసిరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది.

మద్యం కేసులో మొత్తం 4 వేల కోట్లు చేతులు మారాయని ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకూ భారీ మొత్తంలో డబ్బును కనిపెట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్ధితుల్లోనే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో దాచిన 11 కోట్లు సీజ్ చేసి ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సిట్ ప్రయత్నించిందన్న వాదన కూడా వినిపించింది. చివరికి ఆ 11 కోట్లను ఏసీబీ కోర్టు ఆదేశాలతో వీడియోగ్రఫీ చేసి మరీ స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు.

ఇప్పుడు రాజ్ కెసిరెడ్డికి చెందిన 13 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు. మిగిలిన డబ్బు ఎటు వెళ్లిందో కనిపెట్టడం సిట్ కు సవాల్ గా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్న విధంగా వైఎస్ జగన్ ను నిందితుడిగా నిరూపించడంలో విఫలమైంది. ఇప్పుడు మనీ ట్రయల్ నిరూపించడంలోనూ విఫలమైతే మద్యం స్కాం తేలిపోవడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తు చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications