కూటమికి అగ్నిపరీక్షగా స్థానిక పోరు..! లెక్కలు తేల్చేది ఇవే..! వైసీపీ ఎఫెక్ట్ ఎంత ?
ఏపీలో మరో నెల రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు (ap local body polls)రెండున్నరేళ్ల క్రితం ఘన విజయంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి అగ్ని పరీక్ష కాబోతున్నాయి. ఇందులో ఘన విజయం సాధిస్తే తప్ప కూటమి పరిస్ధితి అంతా బావుందని చెప్పలేని పరిస్ధితులు ఎదురుకాబోతున్నాయి. దీని వెనుక చాలా కీలక కారణాలు ఉన్నాయి. సాధారణంగా అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయించేది అధికార పార్టీలే. దానికి భిన్నంగా ఫలితాలు వస్తే మాత్రం అక్కడ ఉన్న బలమైన కారణాలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా గుజరాత్ సహకార సంఘాల ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఓవైపు దేశంలో ఈసీ వివాదాలు, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకుంటున్న వైసీపీ ఈ ఎన్నికల్లో కూటమికి సవాళ్లు విసురుతున్నాయి.
కూటమికి స్థానిక సవాల్
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా జట్టుకట్టిన టీడీపీ,జనసేన, బీజేపీ ఏకంగా 164 స్ధానాలను సాధించి అధికారం చేపట్టాయి. అప్పటి నుంచీ సాఫీగా సాగిపోతున్నట్లు కనిపిస్తున్న కూటమి ప్రయాణంలో రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికల రూపంలో పెను సవాల్ ఎదురుకాబోతోంది. పైకి ఇవి స్దానిక ఎన్నికలే అయినా కూటమికి ప్రత్యర్ధిగా ఉన్న వైఎస్సార్సీపీ వీటిపై స్పందిస్తున్న తీరు చూస్తే ఎన్డీయేకు గట్టి సవాల్ ఎదురుకావడం తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి తిరిగి 2024 ఎన్నికల విజయాన్ని రిపీట్ చేస్తే తప్ప ఎన్డీయే బలంగా ఉందని చెప్పుకునే పరిస్ధితి ఉండదు. కాబట్టి ఇందులో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునేందుకు కూటమి సిద్దంగా లేదు. ముఖ్యంగా కూటమిలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఈ ఎన్నికలు వాటికీ పరీక్షగా మారిపోయాయి. మరోవైపు ఈసీ సహకారంతోనే 2024 ఎన్నికల్ని గెలిచినట్లు వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టాలంటే కూటమికి ఈ ఎన్నికలు మరో మంచి అవకాశం.

పుంజుకుంటున్న వైసీపీ
రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో 151 స్ధానాల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయిన వైఎస్సార్సీపీ.. ఇప్పటికీ అలాగే ఉందని పైకి చెప్తున్న ఎన్డీయే నేతలకు.. పరిస్ధితిలో మార్పు వచ్చిందని స్పష్టంగా అర్దమవుతోంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో డీఎస్సీ అక్రమాలు, నిలబెట్టుకోని హామీలు, క్షేత్రస్దాయిలో రైతులు, ఇతర వర్గాలు పడుతున్న ఇబ్బందులు, ఎల్ నినో కారణంగా ఎదురవుతున్న కష్టాలు.. ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకత బయటపెట్టేందుకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వైసీపీ వదులుకోలేదు. దీంతో ఇప్పుడు వైసీపీకి ఓటేయొద్దని జనానికి చెప్పేందుకు కూటమి కారణాలు ఎదుర్కోవాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. అదే వైసీపీకి మాత్రం ప్రభుత్వ వైఫల్యాలు, నిలబెట్టుకోని హామీలు, ఇస్తున్న పథకాల్లోనూ కోతలు.. ఇలా చాలా అంశాలే ఉన్నాయి. స్థానిక అంశాలు వీటికి అదనం. ఇవన్నీ జనంలోకి సరిగ్గా తీసుకెళ్లగలిగితే తప్పనిసరిగా మంచి ఫలితాలు రాబట్టవచ్చని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో స్థానిక ఎన్నికల వేళ 2024 ఎన్నికల్లో తమ ఓటమికి ఈసీయే కారణమని విమర్శలు చేస్తున్న వైసీపీ.. స్థానిక పోరులో తేడా వచ్చినా అదే కారణం చెప్పుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బీసీ రిజర్వేషన్ల ప్రభావం
బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 27 శాతం రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుని, జీవోలు కూడా ఇచ్చింది. అయితే వాటిని హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. దీంతో పార్టీ పరంగా 34-40 శాతం వరకూ సీట్లు కేటాయిస్తున్నట్లు టీడీపీ చెప్పుకుంటోంది. అయితే గతంలోనూ వైసీపీ హయాంలోనూ ఇలాంటి ప్రయోగాలే జరగడంతో దీనిపై బీసీల్లో పెద్దగా ఆశలు లేవు. అయితే పార్టీల్లో ఆశావహులకు మరిన్ని అవకాశాలు దక్కడం మినహా కొత్తగా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండబోదని విశ్లేషకులు చెప్తున్నారు. సీట్ల కేటాయింపులో మాత్రం టీడీపీ లేదా వైసీపీ ఎవరు ఎక్కువ సీట్లు కేటాయిస్తే వారు రాజకీయంగా పైచేయి సాధించవచ్చని భావిస్తున్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్ల వ్యవహారం పార్టీలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
ఈసీ వివాదాల ప్రభావమెంత ?
కేంద్ర ఎన్నికల సంఘంలో ఎస్ఐఆర్ విషయంలో తలెత్తిన విభేదాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం విపక్షాలు ఢిల్లీలో పెంచుతున్న ఒత్తిడి ప్రభావం ఏపీలో అంతగా కనిపించడం లేదు. దీనికి కారణం కూటమి పార్టీలతో పాటు అనధికారికంగా బీజేపీకి అండగా నిలుస్తున్న వైఎస్సార్సీపీయే ఇందుకు కారణం. బీజేపీ ఏదో విధంగా మద్దతుగా ఉన్న ఈ పార్టీలన్నీ ఈసీ వివాదాలపై ఎక్కువగా స్పందించడం లేదు. వైసీపీ సైతం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో గతంలో చేసిన మార్పుల్ని తిరిగి సవరించాలంటూ కోరుతోంది. అంతే తప్ప జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టడం లేదు. దీంతో రాష్ట్రంలో అంతగా ఉనికి లేని కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే దీనిపై నిరసనలు చేపడుతున్నాయి. ఢిల్లీలో పరిణామాలు ఉన్నట్లుండి తీవ్రంగా మారిపోయి సీఈసీ తొలగింపు వ్యవహారంలో కూటమి, వైసీపీ తమ అభిప్రాయాలు చెప్పకతప్పని పరిస్ధితి ఎదురైతే తప్ప స్థానిక ఎన్నికల్లో ఈ వివాదం ప్రభావం నామమాత్రమే అని చెప్పుకోవచ్చు.

స్ధానిక పోరులో ఏం జరగబోతోంది ?
స్థానిక ఎన్నికల్లో ముందుగా పట్టణ స్దానిక సంస్థల్లో, ఆ తర్వాత గ్రామ స్దానిక సంస్థల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడా వైసీపీ ప్రభావం చూపే అవకాశం ఉంది. కూటమి పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గత విభేదాల కారణంగా కోస్తా ప్రాంతంలో సైతం కొన్ని ఎదురుదెబ్బలు తినేలా కనిపిస్తోంది. అధికార బలం, బలగం ఉపయోగించి వైసీపీని అడ్డుకునేందుకు కూటమి పార్టీలు గట్టిగానే ప్రయత్నించడం, అందులో విజయం సాధించడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. అయితే గతంలో జగన్ హయాంలో జరిగినట్లుగా ఏకపక్షంగా కూటమి క్లీన్ స్వీప్ చేయదనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే వైసీపీ తిరిగి రాష్ట్రంలో పుంజుకోవడానికి అవకాశం లభించినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.















Click it and Unblock the Notifications
