మాది చేతకాని తనం కాదు: తెలంగాణ మంత్రులకు ఏపీ మంత్రి అనిల్ స్ట్రాంగ్ కౌంటర్
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం మరింత ముదురుతోంది. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు సీరియస్ అవుతున్నారు. తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని స్పస్టం చేశారు.

రెచ్చగొట్టే భాష వద్దంటూ ఏపీ మంత్రి అనిల్..
సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారని ఆక్షేపించారు. దివంగత సీఎం వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్ ఉత్పత్తి ఉండాలన్న మంత్రి అనిల్.. తక్కువ సమయంలోనే నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదని అన్నారు.

ఏపీది చేతకాని తనం కాదు..
ఏపీకి కేటాయించిన నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నా.. తెలంగాణ అభ్యంతరం చెబుతోందని మంత్రి అనిల్ విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసం అవసరమైతే ఎంతదూరమైనా వెళ్తామన్నారు. ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే కేఆర్‌బీఎం ఎందుకు? అని ప్రశ్నించారు. అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్నారు. పాలమూరు, దిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదని మంత్రి అనిల్ చెప్పారు. తమ సంయమనం చేతకాని తనం కాదని తీవ్రంగా స్పందించారు.

శ్రీశైలం జలాశయం నిండనివ్వని తెలంగాణ..
శ్రీశైలం జలాశయం నిండకూడదని తెలంగాణ భావిస్తోందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 844 అడుగులపైకి ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యమవుతుందన్నారు. అయితే, తెలంగాణ 800 అడుగులకే నీటిని డ్రా చేస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి అనిల్ తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే ముందు కేఆర్ఎంబీ బృందం తెలంగాణ అక్రమంగా నిర్మించే ప్రాజెక్టులను సందర్శించాలని కోరతామన్నారు. మాటలతో పరిష్కారం లభిస్తుందంటే మేం అంతకంటే ఎక్కువగా మాట్లాడగలం అన్నారు..
Recommended Video

జగన్ అందుకే సంయమనం పాటిస్తున్నారు..
మరో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రైతుల అవసరాల గురించి కూడా తెలంగాణ ఆలోచించట్లేదని అన్నారు. శ్రీశైలం డెడ్‌లైన్ నిల్వ నీటిని కరెట్ పేరుతో వాడటం దుర్మార్గమన్నారు. చేసే పని తప్పా.. ఒప్పా అని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లేదని అన్నారు. తెలంగాణ సర్కారు ప్రవర్తనను మంత్రి మండలి తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలతో సంయమనంతో ఉండాలన్నదే జగన్ విధానమని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం తాము వెనక్కితగ్గేది లేదని కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications