అమ్మఒడి సభకు పిల్లలు కాక సినీ స్టార్లు వెళ్తారా ? హైకోర్టు నోటీసులపై బొత్స రియాక్షన్..!
ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక అధికారులకు ఇవాళ హైకోర్టు ఓ కీలక అంశంలో కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సదరు అధికారులు హైకోర్టుకు వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హైకోర్టు ధిక్కార నోటీసులు పంపడంపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైకోర్టు ఆదేశాలపై మాట్లాడుతూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
వైసీపీ సర్కార్ విద్యార్ధులను స్కూళ్లకు పంపినందుకు వారి తల్లితండ్రులకు ఏటా రూ.15 వేల చొప్పున అమ్మఒడి పేరుతో డబ్బులిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం తాజాగా విజయనగరం జిల్లా కురుపాంలో నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న ఈ సభకు భారీ ఎత్తున స్కూలు విద్యార్దుల్ని, వారి తల్లితండ్రుల్ని తరలించారు. అంతే కాదు సీఎం జగన్ ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

రాజకీయ సభలకు విద్యార్ధుల్ని తరలించవద్దంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని ప్రభుత్వం ఉల్లంఘించిందని, అమ్మఒడి నిధుల విడుదల సభకు భారీ ఎత్తున విద్యార్ధులు, తల్లితండ్రుల్ని తరలించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్ధానిక విద్యాశాఖాధికారి సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా దాఖలైన ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
విద్యార్థుల విషయంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. విద్యార్థులను రాజకీయ సభలకు తరలించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, హోంశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అమ్మ ఒడి సభకు విద్యార్థులు, తల్లిదండ్రులు రావడం తప్పు కాదన్నారు. ఇలాంటి సభలకు పిల్లకు కాకుంటే సినీ నటులు వస్తారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై కోర్టు సూచనలిస్తే పాటిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications