టీడీపీ కాపు రిజర్వేషన్ల డిమాండ్-దాడిశెట్టి రాజా కౌంటర్-ఎవరికి తగ్గించి ఇమ్మంటారని ప్రశ్న..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో టీడీపీ కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ తొలగించిందని, దాన్ని పునరుద్ధరించాలని టీడీపీ కోరుతోంది. ఈ మేరకు టీడీపీలో కాపు నేతలు వరుసగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇవాళ ఘాటుగా స్పందించారు.
ఓ కులం అంటే రాజకీయ నాయకుడికి అభిమానం ఉండాలని, అభిమానం లేకపోయినా ద్వేషం ఉండకూడదని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కాపులంటే నిలువెల్లా ద్వేషమన్నారు. కాపుల్ని ఎలా ఇబ్బందిపెట్టాలనే ద్వేషంతోనే చంద్రబాబు, లోకేష్ ఆలోచనలుంటాయని మంత్రి తెలిపారు. బీసీ ఎఫ్ కేటగిరీలో కాపులకు రిజర్వేషన్ ఇమ్మని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అడుగుతున్నారని, కానీ ఆయన చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించమని మంత్రి దాడిశెట్టి కోరారు.

వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. ఏ బీసీ కులాలకు తగ్గించమంటారో చెబితే అప్పుడు జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండానే తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేయించిందన్నారు. చట్ట పరంగా నిలబడని తీర్మానాలు కేంద్రానికి పంపించారని మంత్రి ఆరోపించారు.ఇప్పుడు రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఏ బీసీ కులానికి రిజర్వేషన్లు తగ్గించి కాపులకు ఇవ్వాలో చెప్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications