దాడి వీరభద్రరావు రాజీనామాపై మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు.దాడి వీరభద్ర రావు తో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వని క్రమంలోనే దాడి వీరభద్రరావు రాజీనామా చేసినట్టు సమాచారం.
2013లో దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు . ఆ తరువాత ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరి అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు ప్రాధాన్యత లభించకపోవడంతో ప్రస్తుతం మళ్లీ ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధినేతతో దాడి వీరభద్రరావు సమావేశం కానున్నారు.

అయితే తాజాగా దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచే వారికి మాత్రమే సీట్లు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని ఆయన పేర్కొన్నారు. తమకు సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని స్పష్టంగా పార్టీ చెప్పిందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నయం చూపిస్తామని అధిష్టానం చెప్పిందని, ఎన్నికల వేల టికెట్లు రాని వారు పార్టీకి దూరంగా ఉండటం వల్ల, పార్టీకి వచ్చే నష్టం ఏమాత్రం లేదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చిందని, అయితే ఆయన వాటిని తిరస్కరించారని, ఇక వారిదే ఆఖరి నిర్ణయం అని తెలిపారు.
కొంతమంది పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవడం కంటే వెళ్లిపోవడమే మంచిదని గుడివాడ అమర్నాథ్ దాడి వీరభద్రరావు ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 సీట్లు మాత్రమే ఉన్నాయని, 175 మందికే అవకాశం ఇవ్వగలమని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications