లోన్ యాప్ టార్చర్-25 వేలు ఇచ్చా-10 మంది లాయర్లొచ్చారు-మంత్రి కాకాణి సంచలనం
ఇప్పటివరకూ సాధారణ జనాన్నేవేధిస్తున్నారని భావిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు ఇప్పుడు ప్రముఖుల దాకా వచ్చేసారు. వారి వేధింపులకు తాళలేక సాధారణ జనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్ధితి. ఇప్పుడు ప్రముఖులూ అదే స్ధాయిలో టార్చర్ అనుభవిస్తున్నారని తేలిపోయింది. ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉదంతమే ఇందుకు ఉదాహరణ.
లోన్ యాప్ ఏజెంట్లు తనను ఎలా వేధించారన్న దానిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ గుట్టు విప్పారు. లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకుని పలువురు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని మంత్రి తెలిపారు. ముత్తుకూరులో గడప గడప కార్యక్రమంలో పాల్గొంటుండగా లోన్ యాప్ నిర్వాహకులు తన ఫోన్ కు 79 కాల్స్ చేశారని కాకాణి వెల్లడించారు. సాధారణంగా తన ఫోన్ తానే ఎత్తుతానన్నారు.కానీ గడప గడపకూ కార్యక్రమంలో బిజీగా ఉండటంతో తన పీఏ ఫోన్ ఎత్తారన్నారు.

కానీ తనకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై ఆరా తీసినట్లు మంత్రి కాకాణి వెల్లడించారు. అప్పుడు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్న అశోక్ కుమార్ తన నంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని తెలిసిందన్నారు. అందుకే ఫోన్ చేస్తున్నామని చెబుతున్నారన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వివరాలు సేకరించి నలుగురిని అరెస్ట్ చేశారని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత వారిని విడిపించేందుకు పది మంది ప్రముఖ లాయర్లు రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
ఈ మధ్యలో లోన్ యాప్ ముఠాను ట్రాప్ చేసేందుకు.. పోలీసుల విచారణలో భాగంగా తన పిఏ 25,000 రూపాయలు వారికి చెల్లించాడని మంత్రి తెలిపారు. ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే పోలీస్ కు కానీ, తనకు కానీ చెప్పాలని మంత్రి కోరారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఆగడాలు చెల్లుబాటు కాక చెన్నై కేంద్రంగా ముఠా దారుణాలు చేస్తోందన్నారు. ఈ లోన్ యాప్ కేసులో నెల్లూరు జిల్లా పోలీసులు నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్టు మంత్రి చెప్తున్నారు.












Click it and Unblock the Notifications