ఫాతిమా విద్యార్థుల ముందున్న ఆప్షన్లు ఇవేనంటున్న మంత్రి కామినేని

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు సూచన మేరకు వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం ఫాతిమా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ లో జరిగిన ఈ సమావేశంలో ఫాతిమా విద్యార్ధుల ముందు మంత్రి కామినేని పలు ఆప్షన్లు ఉంచారు. వాటిలో ఎవరికి నచ్చిన ఆప్షన్ల ను వారు ఎంచుకోవచ్చని చెప్పారు.

తమ సమస్య పరిష్కారం కోసం ఫాతిమా విద్యార్ధులు సెల్ టవరెక్కి ఆందోళన చెయ్యడంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఫాతిమా విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. తానే స్వయంగా ఫాతిమా విద్యార్ధులతో మాట్లాడి వారి మనోభావాలను అర్థం చేసుకోవడంతో పాటు వారి అభీష్టానికి అనుకూలంగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సిఎం వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఎపి వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫాతిమా విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మరోసారి సమావేశమయ్యారు.

మా తప్పేం లేదు...

మా తప్పేం లేదు...

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జరిగిన అన్యాయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పాత్ర గానీ, లోపం గానీ ఏమీ లేదన్నారు. ఫాతిమా కాలేజ్ యాజమాన్యం వల్లే విద్యార్ధులకు అన్యాయం జరిగిందన్నారు. అయితే నష్టపోయిన విద్యార్ధులకు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంసీఐ కి ఇచ్చిన ప్రతిపాదనలను విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మంత్రి వివరించారు.

మళ్లీ ఢిల్లీకి...

మళ్లీ ఢిల్లీకి...

ఫాతిమా కేసుపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం సీఎం చంద్రబాబు ఆదేశాలపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పీనడ్డాను, కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని తాను ఇప్పటికే ఒకసారి కలవడం జరిగిందని మంత్రి కామినేని విద్యార్ధులకు చెప్పారు. అయినప్పటికి ఫాతిమా విద్యార్ధుల సమస్య పరిష్కారం కోసం వారం రోజుల్లో మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నడ్డా గారిని కలవనున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కేంద్ర మంత్రిని కలసి ఫాతిమా సమస్యపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఎంసీఐ ప్రతినిధులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరతానని చెప్పారు. అయితే ఆ సమావేశం కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని రిక్వెస్ట్ చేస్తానని మంత్రి కామినేని విద్యార్ధులకు వివరించారు.

పలు ప్రతిపాదనలు...

పలు ప్రతిపాదనలు...

ఫాతిమా విద్యార్ధులు, తల్లిదండ్రులతో సమావేశం సందర్భంగా మంత్రి కామినేని వారి ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు.
1) రాబోయే విద్యాసంవత్సరానికి విద్యార్ధులు నీట్ పరీక్ష రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీట్ కోచింగ్ ఉచితంగా ఇప్పిస్తుందని మంత్రి తెలిపారు. విద్యార్ధులకు విజయవాడలోని పోరంకి లో ఉన్న నారాయణ కాలేజ్ క్యాంపస్ లో ప్రత్యేకంగా వీరికి స్పెషల్ గా కోచింగ్ సోమవారం నుండి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

2) ఎవరైతే విద్యార్ధులు తమకు మెడికల్ సీటు వద్దు అనుకొంటారో వారికి ఫాతిమా యాజమాన్యం నుండి ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తుందన్నారు.

3) ఈ నెల 14న ఫాతిమా యాజమాన్యంతో తల్లిదండ్రుల సమక్షంలో సమావేశమై సమస్య పరిష్కారాలపై చర్చించనున్నట్లు మంత్రి చెప్పారు.

నారాయణకే విద్యార్ధుల మొగ్గు....

నారాయణకే విద్యార్ధుల మొగ్గు....

ఎక్కువ మంది విద్యార్ధులు నారాయణలో కోచింగ్ తీసుకొనేందుకు సుముఖంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి కామినేని తెలిపారు.
నీట్ కోచింగ్ కావాలనుకునే విద్యార్థులంతా సోమవారం ఉదయం 11 గంటలకు పోరంకి నారాయణ క్యాంపస్‌కు రావాలని సూచించారు. అయితే కొంతమంది విద్యార్ధులు ఢిల్లీలో జరిగే సమావేశం అనంతరం నిర్ణయం తీసుకోవాలని అనుకొంటున్నారని చెప్పారు.

108 సేవల గురించి....

108 సేవల గురించి....

రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా 108 సేవలను నిర్వహిస్తున్న GVK-EMRI సంస్ధ కాలపరిమితి తీరిపోవడంతో కొత్త గా టెండర్లు పిలిచామన్నారు. అయితే కొత్త టెండర్లను రద్దు చేయాలని ఎన్జీవోలు కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కానీ 108 సేవలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హై కోర్టులో తీర్పు వచ్చినట్లు మంత్రి కామినేని తెలిపారు. త్వరలో కొత్త సర్వీస్ ప్రొవైడర్ వస్తారన్నారు. కొత్తగా వచ్చే సంస్ధ ప్రత్యేకంగా యాప్ ని తయారు చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది దగ్గరిలో ఉన్న ఆసుపత్రికి సమాచారం ముందుగా అందిస్తారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకొనివచ్చేలోగా ఆసుపత్రిలో సిబ్బంది అప్రమత్తం అవుతారని మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
amaravathi: ap health minister Kaminieni Srinivas met with Fatima students and their parents on Thursday at NTR Health University. In this meeting Minister kamineni has put various options infront of Fatima students.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి