ఏపీలో విద్యార్ధినిలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్.. మరో కొత్త పథకానికి శ్రీకారం !
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం విద్యార్ధినిలకు మరో తీపి కబురు ప్రకటించనుంది. రాష్ట్రంలోని విద్యార్థినుల ఉన్నత విద్యాభ్యాసానికి కొత్త దారులు తెరుస్తూ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినుల చదువులకు శాశ్వత భరోసా కల్పించేలా "కలలకు రెక్కలు" (Kalalaku Rekkalu Scheme) అనే పేరుతో ప్రత్యేక పథకాన్ని త్వరలో అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు.
ఈ మేరకు ఉండవల్లి లోని తమ నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేయడానికి విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి గల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం కింద సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి లోకేష్ వివరించారు. స్వదేశంలో 88,196 మంది ఉన్నత చదువులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్యా పథకం ఏ విధంగా అమలు చేయాలన్న విషయంపై లోతుగా అధ్యయనం చేసి అమలు చేస్తామన్నారు. అలానే నిరుపేద విద్యార్థినులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
"కలలకు రెక్కలు" స్కీం ఎలా ఉండవచ్చు..
'కలలకు రెక్కలు' పథకం ద్వారా ఆర్థిక సమస్యల వల్ల చదువులు ఆపేసే పరిస్థితి లేకుండా, ప్రతి అమ్మాయి తనకు నచ్చిన కోర్సు - దేశంలో గాని, విదేశాల్లో గాని - సులభంగా అభ్యసించగలదని సర్కార్ భావిస్తోంది. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఇది బంగారు అవకాశం కానుంది. ప్రభుత్వ వర్గాల అంచనాల ప్రకారం పథకంలో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి:
- ఉన్నత చదువుల్లో మెరిట్ ఆధారంగా ఆర్థిక సహాయం
- విదేశీ విద్యకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు
- ఆన్‌లైన్ అప్లికేషన్, పారదర్శక ఎంపిక
- పేద, మధ్యతరగతి విద్యార్థినులకు ప్రాధాన్యత
- కోర్సు ఫీజులు, వసతి, ప్రయాణం వంటి ఖర్చులకు సహాయం
- ప్రపంచస్థాయి యూనివర్సిటీల్లో చదువు కోసం మార్గదర్శకత్వం
ఇక ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని కొనసాగిస్తున్న సర్కారు.. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15000 నగదు జమ చేస్తుంది. గతంలో కేవలం టెన్త్ విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ స్కీమ్ ను, ఇంటర్ విద్యార్థులకు సైతం పొడిగించారు. అలానే అధికారంలోకి రాగానే పెద్ద పండుగ పేరుతో ప్రతి బడిలో మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో సైతం మార్పులు తెచ్చారు. ఇక ఇప్పుడు మరో కొత్త పథకంతో విద్యార్థులకు మేలు చేకూర్చేందుకు శ్రీకారం చుట్టడం మంచి విషయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యాను. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేయడానికి విధివిధానాలు రూపొందించాలని చెప్పాను. స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం…
— Lokesh Nara (@naralokesh) November 22, 2025












Click it and Unblock the Notifications