నా తల్లిని తిట్టినోళ్లను వదిలేయాలా ? మండలిలో లోకేష్ ఫైర్..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీతో పోలిస్తే మండలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ మాటల యుద్దం కొనసాగుతోంది. ఇవాళ కూడా అదే పరిస్ధితి కనిపించింది. రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలపై స్పందించిన నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఓ దశలో తీవ్ర ఆవేశానికి లోనైన లోకేష్.. నా తల్లిని అవమానించిన వారిని వదిలేయాలా అంటూ వైసీపీని ప్రశ్నించారు.
మండలిలో ఉదయం సభకు రాగానే మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వైసీపీ అధినేత జగన్ సభకు రాకపోవడంపై ప్రశ్నించారు. దీనిపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. గతంలో చంద్రబాబు కూడా సభకు రాలేదని గుర్తుచేసింది. అయితే దీనికి కారణమైన ఘటన వైపు ఈ చర్చంతా మళ్లింది. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. తన తల్లిని తిట్టినోళ్లకు టికెట్లు ఇచ్చినా ఓడిపోయారంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తామేం అవమానించలేదని విపక్ష నేత బొత్స తెలిపారు.

తల్లిని అవమానించిన వారిని తామేమే ప్రోత్సహించడం లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పగా.. మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదా అని అడిగారు. దీంతో ఆ విషయం వేరని ఏదో సర్దిచెప్పబోయారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మండలి ఛైర్మన్ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications