బాలయ్యపై జగన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కౌంటర్..! ఏం జరిగిందంటే?
ఏపీ అసెంబ్లీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని సరిచేసే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను సైకో అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్ర కలకలం రేపాయి. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతూ బాలయ్యను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే చిరంజీవి మాత్రం బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగిపోయిందని అంతా భావించారు.
కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్ మళ్లీ ఆ విషయాన్ని కెలికారు. చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా.. కావాలని రాద్దాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుమతించారని జగన్ ప్రశ్నించారు. బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ సూచించారు. దీంతో జగన్ వ్యాఖ్యలు మళ్లీ ఈ వివాదాన్ని రాజేశాయి.

దీనిపై ఇవాళ ఏపీ సమాచారశాఖ మంత్రి పార్ధసారధి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని మంత్రి తెలిపారు. సహచర శాసనసభ్యుడి గురించి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని సూచించారు. బాలకృష్ణ గురించి అభ్యతరకరంగా జగన్ ఎలా మాట్లాడతారని పార్ధసారధి ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మరోవైపు బాలకృష్ణ తాగి అసెంబ్లీలోకి వచ్చారంటూ జగన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తద్వారా బాలయ్య తాగి రాలేదని, ఆయన బాడీ లాంగ్వేజే అలా ఉంటుందని పార్ధసారధి చెప్పినట్లయింది. అయితే జగన్ వ్యాఖ్యలపై పార్ధసారధి కౌంటర్ తో ఈ వివాదం మరోసారి తెరపైకి వస్తోంది. దీనిపై ఇరు పార్టీల శ్రేణులు అప్పుడే సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టేశారు.












Click it and Unblock the Notifications