అమరావతిలో మీరే ఉండాలా ? పేదలకు ఇవ్వొద్దా ? చంద్రబాబుపై పేర్నినాని ఫైర్
అమరావతి రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని విపక్ష టీడీపీ తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రంగా స్పందించారు. ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన టీడీపీ, చంద్రబాబు,ఎల్లోమీడియాపై తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి రాజధాని మీ ఒక్కరి సొత్తా? అక్కడ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా? కేవలం మీ వర్గం వారే ఉండాలా? ఇతరులు రావొద్దా? అలాంటప్పుడు అది రాష్ట్ర రాజధాని ఎలా అవుతుంది? అని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని టీడీపీ నేతల్ని, ఎల్లో మీడియాను ప్రశ్నించారు. దీనిపై ఎల్లో మీడియాలో దారుణంగా విషపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహారం చేస్తున్నారన్నారు. ఇంతకన్నా దిగజారుడు ఇంకా ఏమైనా ఉంటుందా? అని పేర్ని ప్రశ్నించారు.
చంద్రబాబు ఎవరికైనా భూములు ఇవ్వొచ్చా? ఆయన వేల ఎకరాలిచ్చినా ఆ మీడియాకు కనబడదని పేర్నినాని అన్నారు. అదే జగన్‌గారు పేదలకు స్థలాలిస్తామంటే తప్పా? అని పేర్ని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పాదయాత్ర పేరుతో మళ్లీ డ్రామాలకు తెర తీశారంటూ అమరావతి రైతులపై పేర్ని మండిపడ్డారు.పాదయాత్రకు కలెక్షన్ ఫుల్, సానుభూతి నిల్ అన్నారు. ఉద్యమం పేరుతో యథేచ్ఛగా వసూళ్ల రాజకీయం సాగుతోందన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. రైతులకు విత్తన బకాయిలు ఇవ్వకుండా పోయిందెవ్వరు? వరసగా నాలుగేళ్లు పంట నష్టం ఎగ్గొట్టింది ఎవ్వరు? అని నిలదీశారు. సంక్షేమాన్ని చూడలేక రోజూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను మార్చడం కంటే, ముఖ్యమంత్రిని మార్చొచ్చు కదా అని లోకేష్ ట్వీట్ చేశాడా? అదో పనికి మాలిన పని అన్నారు. ఎవరో ఒక మనిషిని కిరాయికి పెట్టుకోవడం.
ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు పెట్టడం. దానికి పైసా పెట్టుబడి లేదన్నారు. జీతగాళ్లను పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్నారు. 2017లో ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టిన లోకేష్ అసలు మంత్రి ఎలా అయ్యాడని పేర్ని నిలదీశారు. మీ అయ్యకు చెప్పవా? ఆయనకు ట్వీట్ పెట్టావా? జగన్‌గారు మాత్రమే దొరికారా? అని అడిగారు.












Click it and Unblock the Notifications