
రెండు గంటలకు పైగా పేర్నినాని-రామ్ గోపాల్ వర్మ చర్చలు-మధ్యలో నాన్ వెజ్ లంచ్
ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చల కోసం వచ్చిన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో జరుగుతున్న ఈ భేటీలో వర్మ, నాని సినిమా టికెట్ల ధరలపై చర్చిస్తున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగుతున్న ఈ చర్చల్లో పలు కీలక అంశాలు చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
సినిమా టికెట్ల దరల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ఆలస్యంగా స్పందించిన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మేరకు మంత్రి పేర్నినానితో ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య సాగిన హాట్ హాట్ సంభాషణ తర్వాత వర్మ వరుసగా పేర్నినానికి ట్వీట్లు పెట్టారు. సినిమా టికెట్ల ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎవరనే వర్మ ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో వర్మ, నాని మధ్య సాగిన ట్వీట్ వార్ లో చాలా అంశాలు తెరపైకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే తనకు అపాయింట్ మెంట్ ఇస్తే కలిసి కూర్చుని చర్చిద్దామని వర్మ ప్రతిపాదించడం, నాని సరేననడం జరిగిపోయాయి.

మంత్రి పేర్నినాని ఇవాళ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో అమరావతి వచ్చిన వర్మ.. ఆయనతో సచివాలయంలో భేటీ అయ్యారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వర్మ.. తాను దర్శకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చానని, టాలీవుడ్ ప్రతినిధిగా రాలేదంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్నారు. చివరకు నానితో భేటీకి వెళ్లిన వర్మ... గంటపాటు చర్చ తర్వాత ఆయనతో పాటు నాన్ వెజ్ లంచ్ కూడా చేశారు. అనంతరం మళ్లీ వీరిద్దరూ కూర్చుని చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలో సినిమా టికెట్ల ధరల సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని టాలీవుడ్ తో పాటు ఏపీ ప్రభుత్వ వర్గాలు, సినీ అభిమానులు కూడా అంచనా వేసుకుంటున్నారు. అయితే వర్మతో చర్చల్లో ప్రభుత్వం ఆయనకు ఏ హామీ ఇస్తుందన్న దానిపైనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. మరికాసేపట్లో వర్మ, నాని చర్చలు ముగియనుండగా.. ఆ తర్వాత వీరిద్దరూ మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశముంది.