Breaking : ఉద్యోగుల సమ్మెపై తేల్చేసిన మంత్రులు-ఇక ప్రకటనే తరువాయి ? జగన్ తో భేటీ తర్వాత
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రుల కమిటీతో నిన్న అర్ధరాత్రి వరకూ చర్చించిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు.. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు తెలుస్తోంది దీంతో ఈ విషయాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతల్ని కూడా సీఎం వద్దకు పిలిపించి వారితోనే సమ్మె విరమణపై ప్రభుత్వం ప్రకటన ఇప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
Recommended Video

సమ్మెపై ఉద్యోగులు వెనక్కి?
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగసంఘాలు పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏర్పడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. ఇప్పటికే దీన్ని అమల్లో కూడా పెట్టేశాయి. అయినా ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఉద్యోగ నేతల్ని చర్చలకు పిలుస్తున్నా ఓ మెట్టు దిగేందుకు ఇష్టపడలేదు.
కానీ తాజాగా ఛలో విజయవాడ విజయవంతం అయిన నేపథ్యంలో రేపటి నుంచి సమ్మెకు వెళ్తున్న ఉద్యోగుల్ని బుజ్జగించేందుకు చివరి క్షణంలో సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రుల కమిటీ వారి ముందు పలు ప్రతిపాదనలు ఉంచింది. వీటిపై వారు అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.

ప్రభుత్వ ప్రతిపాదనలివే
ప్రభుత్వం తాజాగా ఉద్యోగ నేతల ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచింది. వీటిలో ముఖ్యంగా హెచ్ఆర్ఏ శాతాల పెంపుతో పాటు సీసీఏ రద్దును వెనక్కి తీసుకోవడం, ఐదేళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వమే పీఆర్సీ ఇచ్చేలా నిర్ణయం, 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ వంటివి ఉన్నాయి.
అయితే ఉద్యోగులు కోరుతున్న ఫిట్ మెంట్ శాతం పెంపుపై మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ప్రకటించిన ఫిట్ మెంట్ శాతం 23కే కట్టుబడి జీతాలు కూడా ఇచ్చేసినందున దీనిపై వెనక్కి తగ్గబోమని చెబుతోంది. అయితే ఉద్యోగ నేతలు మాత్రం కనీసం 27 శాతమైనా ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై సీఎం జగన్ వద్ద ఓ హామీ లభిస్తే వారు సమ్మె విరమణకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల లీకులు
మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి నేతలతో నిన్న రాత్రి జరిపిన చర్చలు ఫలించినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించుకుంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మంత్రుల కమిటీలో సభ్యులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, పేర్నినాని కూడా చర్చలు సానుకూలంగా ముగిశాయని, కీలక అంశాలపై ఉద్యోగ నేతకు హామీ ఇచ్చామని, మిగిలినవన్నీ చిన్న విషయాలేనని చెప్తున్నారు. ఇవాళ్టితో అన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని మంత్రి బొత్స తెలిపారు. మరో మంత్రి పేర్నినాని కూడా సీఎం జగన్ తో ఈ మధ్యాహ్నం జరిగే భేటీ తర్వాత ఉద్యోగులు సమ్మె విరమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications