ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ-మంత్రుల రాజీనామాల సమర్పణ-రాత్రికి ఆమోదించే ఛాన్స్
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో మిల్లెట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్య, వైద్య, ప్రణాళికా శాఖల్లో నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జిల్లాలవిభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేసిన ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం ఆమోదించింది.
ఇవాళ కేబినెట్ భేటీ ముగియగానే మంత్రులందరూ సీఎం జగన్ కు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ భేటీకి తమ లెటర్ హెడ్లతోనే వెళ్లిన మంత్రులు.. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత జగన్ కోరినట్లుగా రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో కాసేపు మాట్లాడారు. అనంతరం మంత్రులు బయటికి వచ్చేశారు. అనంతరం మాజీలుగా మారిన మంత్రులు.. తమ సొంత వాహనాల్లోనే సచివాలయం నుంచి వెళ్లిపోయారు. మంత్రులు చేసిన రాజీనామాల్ని జీఏడీ కార్యదర్శి కాసేపట్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు స్వయంగా అందించనున్నారు. వాటికి ఈ రాత్రికే ఆమోదముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు మొదలైపోయాయి. సచివాలయానికి సమీపంలోనే వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే ఈ నెల 11న కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి గవర్నర్ కు కూడా సీఎం జగన్ ఇప్పటికే సమాచారం కూడా అందించారు. మంత్రుల ప్రమాణస్వీకారానికి గవర్నర్ కు అధికారికంగా జగన్ ఆహ్వానం కూడా అందించారు. దీంతో కొత్త మంత్రుల పేర్లతో పాటు వారికి కేటాయించే శాఖలపై ఊహాగానాలు మొదలైపోయాయి.












Click it and Unblock the Notifications