సీఎం జగన్ తో చర్చించే "హీరో"లెవరు: మెగాస్టార్..నాగ్ మౌనం - ఒత్తిడి : ఏపీలో ఆ సినిమాలు విడుదలయ్యేనా..!!
ఏపీలో ఇప్పుడు కొత్త వివాదం నడుస్తోంది. టాలీవుడ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా బయటకు పరిస్థితి కనిపిస్తోంది. ఈ వివాదం పరిష్కారం కావలంటే టాలీవుడ్ హీరోలు ముందుకు రావాలని పరిశ్రమ కోరుతోంది. మరి..సీఎం జగన్ తో చర్చించి..సమస్యలు పరిష్కరించే హీరోలు ఎవరు. కొద్ది రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా వీటి విడుదలకు దర్శక- నిర్మాతలు నిర్ణయించారు. అయితే, తెలుగు సినిమాలకు తెలంగాణతో పాటుగా ఏపీ మార్కెట్ చాలా కీలకం.
Recommended Video

ఏపీ మార్కెట్ టాలీవుడ్ కు కీలకం
ఇప్పుడు విడుదల అవుతున్నవి పాన్ ఇండియా మూవీలు. ఇతర బాషల్లోనూ విడుదల అవుతున్నా..తెలుగు ఏరియా పైనే ఎక్కువ కలెక్షన్ల పైన అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో భిన్న వాతావ రణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ దెబ్బ తింది. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గటంతో..తిరిగి కోలుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఒక దశలో సినిమాలు విడుదల అయినా..అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ..రారా అనే సందేహం చిరంజీవి లాంటి అగ్రశ్రేణి నటులే వ్యక్తం చేసారు. ఇప్పుడు తిరిగి థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది.

ఆ రెండు మూవీలతో మళ్లీ కోలుకుంటామనే ఆశలతో
అఖండ..పుష్పతో ప్రేక్షకుల రాక పైన సందిగ్ధత వీడింది. అయితే, ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ప్రేక్షకులు వస్తారనే నమ్మకం కలుగుతున్న వేళ.. అసలు సినిమాలు విడదుల అయినా.. ఏపీలో సినిమా థియేటర్లు నడుస్తాయా లేదా అనే కొత్త టెన్షన్ కనిపిస్తోంది. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వివాదం కొనసాగుతున్న వేళ..ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లారు. కోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. దీని పైన ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. దీని పైన విచారణ సాగుతున్న సమయంలో ప్రభుత్వం సినిమా థియేటర్లపై తనిఖీల పరంపర కొనసాగిస్తోంది. అనేక జిల్లాల్లో పలు థియేటర్లు సీజ్ చేసారు.

ఏపీ ప్రభుత్వంతో చర్చించేదెవరు
నిబంధనలు పాటించలేదని నోటీసులు ఇస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 70 థియేటర్లకు నోటీసులు ఇచ్చారు. భారీగా జరిమానాలు వేస్తున్నారు. పరిమాణం సరిగా లేని కూల్‌డ్రింక్స్ విక్రయించడంతో రెండు కేసులు, తినుబండారాలపై కంజ్యూమర్ కేర్ వివరాలు లేకపోవడంతో కేసులు నమోదవుతున్నాయి. నిబంధనల ప్రకారం థియేటర్లలో సౌకర్యాలు, లైసెన్సు రెన్యువల్ పత్రాలను పరిశీలిస్తున్నారు. దీంతో..ఎగ్జిబిటర్లు స్వచ్చందంగా థియేటర్లు మూసి వేస్తున్నారు. ఇక, ఈ సమయంలో సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు నేరుగా చర్చలు చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇదే అభిప్రాయంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఏకీభవిస్తున్నారు.

చిరంజీవి - నాగ్ మౌనం వెనుక
కానీ, సీఎం జగన్ తో చర్చించేదెవరు. ఇప్పుడు ఇదే ప్రశ్న టాలీవుడ్ ను వేధిస్తోంది. గతంలో చిరంజీవి.. నాగార్జున.. రాజమౌళి.. సీ కళ్యాణ్..డీ సురేష్ బాబు వంటి వారు ముందుకు వచ్చారు. కానీ, ఇప్పుడు చిరంజీవి - నాగ్ తో సహా అందరూ మౌనం పాటిస్తున్నారు. సినిమా వేడుకల్లోనూ...ట్విట్టర్ లోనూ ప్రభుత్వాన్ని కోరటం మినహా..ప్రత్యక్షంగా కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవటం లేదు. వారు ముందుకు రావటం లేదా..ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వటం లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ సమస్య మరింతగా కంటిన్యూ అవుతే.. ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్నా భారీ బడ్జెట్ సినిమాల పైన ప్రభావం పడనుంది.

మెగాస్టార్ పైన పెరుగుతున్న ఒత్తిడి
అసలు ఏపీలో ఎగ్జిబిటర్లు సినిమాలు ప్రదర్శించేందుకు మందుకు రావాలంటే..టాలీవుడ్ ప్రముఖులు ముందుగా ప్రభుత్వం తో చర్చించి సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం తన పట్టు కొనసాగిస్తోంది. ఇప్పుడు చిరంజీవి..నాగార్జున మౌనంగా ఉండటం వెనుక..అనేక చర్చలు సాగుతున్నాయి. వారిద్దరి పైనే ఇప్పుడు ప్రధానంగా ఒత్తిడి పెరుగుతోంది. మరి..ఇప్పుడు వారిద్దరూ ఏం చేస్తారు..సీఎం జగన్ తో చర్చించేదెవరు.. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది...ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications