ఏపీ మున్సిపోల్స్ : రెండు గంటల్లో 13 శాతం పోలింగ్-కోస్తాలో చురుగ్గా, సీమలో మందకొడిగా
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తర్వాత జరుగుతున్న మున్సిపల్ పోరులో ఓటు వేసేందుకు సాధారణ ఓటర్లతో పాటు రాజకీయ నేతలు, కార్యకర్తలు, పార్టీల అభిమానులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పలు జిల్లాల్లో ఉత్సాహంగానూ, మరికొన్ని జిల్లాలో మందకొడిగానూ సాగుతోంది. తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల అధికారులు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఇందులో అథ్యధికంగా గంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో 16 శాతం చొప్పున నమోదు కాగా.. విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో 14 శాతం చొప్పున, కృష్ణాలో 13 శాతం, నెల్లూరు, అనంతపురంలో 12 శాతం చొప్పున, కర్నూల్లో 11 శాతం, చిత్తూరులో 9 శాతం, కడపలో 8 శాతం నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటున 13 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. ఏకగ్రీవమైన మున్సిపాలిటీల్లో పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల ఉన్నాయి. కార్పోరేషన్లలోనూ పలు చోట్ల డివిజన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. తిరుపతి కార్పోరేషన్లలో సగం డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.












Click it and Unblock the Notifications