కొనసాగుతున్న కొత్త జిల్లాల రచ్చ: నేడు హిందూపురం బంద్ కు అఖిలపక్షం పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రగడ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నాటి నుంచి జగన్ సర్కార్ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి చాలా చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్ కు పిలుపు
పలు జిల్లా కేంద్రాల ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా, జిల్లాల పేర్లపై కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో కొన్ని చోట్ల కొత్త ఆకాంక్షలు పుట్టుకొస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ శనివారం నాడు అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది.

పుట్టపర్తి జిల్లా కేంద్రం చెయ్యటంపై అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జగన్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే అనేక చోట్ల ఆందోళన చేస్తున్న ప్రజలు జిల్లాలు ఏర్పాటుపై బంద్ కు పిలుపునిస్తున్నారు. తాజాగా శనివారం నాడు హిందూపురంలో అఖిలపక్ష నేతలు బందుకు పిలుపునిచ్చారు.కొత్త జిల్లాల ఏర్పాటు లో భాగంగా పుట్టపర్తి జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సత్యసాయి జిల్లా పేరు విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా జిల్లా కేంద్రం విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

హిందూపురం ను జిల్లా కేంద్రం చెయ్యాలన్న ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే తన నిర్ణయాన్ని వెల్లడించి, ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచారు. హిందూపురంలో పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి జరిగిందని దానిని జిల్లా కేంద్రంగా చేయాలని కోరారు. దీనిపై హిందూపురంలో శనివారం నాడు అఖిలపక్షం బంద్ నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసంతృప్తి సెగలు రాజేస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా నిర్ణయించడం హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

లోక్ సభా నియోజకవర్గాన్ని కాదని పుట్టపర్తిని ఎలా జిల్లా కేంద్రం చేస్తారని ప్రశ్న
లోక్ సభ నియోజకవర్గ కేంద్రాన్ని కాదని పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఉన్న హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని ఆ ప్రాంత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయాలకు తావులేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం పట్టణానికి చెందిన వైసీపీ నేతలు మినహా మిగిలిన పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు .

కడపలోనూ అసంతృప్తి సెగలు
ఇదిలా ఉంటే ప్రస్తుతం కడప జిల్లాలోనూ అసంతృప్తి సెగలు అలముకున్నాయి. రాజంపేట కాదని రాయచోటి ని జిల్లా కేంద్రం చేయడంపై అక్కడి నాయకులు పార్టీలకతీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిలో కలపటం ఏమిటని ఆప్రాంతంలో సైతం నిరసనమంటలు చెలరేగుతున్నాయి. ఇక పురపాలక సంఘం కార్యవర్గం మొత్తం రాజీనామాకు సిద్ధ పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కృష్ణా జిల్లాలోనూ రచ్చ .. నర్సీపట్నం జిల్లాకేంద్రం చెయ్యాలని డిమాండ్
మరోపక్క గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణాజిల్లాలో కలవడంపై ఆ ప్రాంత వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న శృంగవరపుకోటనువిజయనగరం లో కలపటం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇక ఇదే సమయంలో నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయకపోవడంపై ఆ ప్రాంతంలో అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి.అటు ప్రతిపక్ష పార్టీల నాయకులే కాకుండా అధికార పక్ష ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాల ఏర్పాటు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది.