ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ తీసుకుంటున్నారు.. ఎందుకో తెలుసా ?
Recommended Video
ఇప్పుడు ఏపీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులు తీసుకుంటున్నారు... అదెలా సాధ్యం, నమ్మలేకపోతున్నాము అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం అందించిన బృహత్తర పథకం తో ఇప్పుడు ఎవరు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవడానికి అవకాశముంది. అసలిదంతా నిజమేనా అని ఆలోచనలోపడ్డారా.. అయితే ఈ స్టోరీ చదివేయండి... మీకే అర్థమవుతుంది.

రేషన్ పోర్టబులిటీ ట్రయల్ రన్ సక్సెస్
ఒకే దేశం ఒకేసారి ఎన్నికల తరహాలో , ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విధానాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ విధానం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొనసాగుతోంది. ఇక తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రేషన్ పోర్టబులిటీ ట్రయల్ రన్ విజయవంతమైంది.

తెలంగాణాలో రేషన్ తీసుకున్న ఏపీ వాసులు ... రేషన్ పోర్టబులిటీలో తెలంగాణా ముందడుగు
ఏపీ, తెలంగాణ లతో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్ లను రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఆగస్టు 1వ తేదీ నుండి ఒకే దేశం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారు అధికారులు. అయితే అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ట్రయల్ రన్ నిర్వహించారు. పంజాగుట్టలోని ఒక రేషన్ షాప్ లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందినవారు ఇద్దరు రేషన్ సరుకులు తీసుకున్నారు. రేషన్ పోర్టబులిటీతో విజయవంతంగా వారు రేషన్ సరుకులు తీసుకోవడంతో తెలంగాణలో రేషన్ పోర్టబులిటీ సక్సెస్ అయిందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారులకు ఏప్రాంతంలోనైనా సరుకులు తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కల్పించింది. ఇక తాజాగా ఒకే దేశం ఒకే కార్డు కు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ఒకడుగు ముందుకేసింది.

ఆగస్టు 1 నుండి అమలు కానున్న విధానం .. వలసదారులకు ఏంతో ఉపయోగం అన్న అధికారులు
ఇక ఆగస్టు 1 నుండి నాలుగు రాష్ట్రాల్లో ఈ విధానం అమలు కానున్న నేపథ్యంలో ట్రయల్ రన్ విజయవంతం కావడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ పోర్టబిలిటీ గతేడాది ఏప్రిల్ నుండి అమలు చేస్తున్నట్లు గా అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ రేషన్ పోర్టబులిటీ వలసదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఒకే దేశం ఒకే కార్డు కింద రేషన్ పోర్టబులిటీ సక్సెస్ ఫుల్ గా అమలుచేసి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.












Click it and Unblock the Notifications