జాగ్రత్త... ఏపీని ముంచెత్తబోతున్న వానలు
ఏపీని బంగాళాఖాతం వదిలిపెట్టడంలేదు. వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతుండటంతో వాతావరణం ముసురుపట్టి ఉంటోంది. మరో రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపు రెండువారాల నుంచి రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. సూర్యుడు కనపడి 15 రోజులు దాటింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలవల్ల ప్రజలకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఉంది. దీనివల్లే వానలు పడుతుండగా, ఈరోజు లేదంటే రేపు మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రెండురోజులు భారీ వర్షాలు
ఏపీలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు. ఏపీతోపాటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 20 రోజుల తర్వాత హైదరాబాద్ లో ఈరోజే సూర్యుడు కనపడ్డాడు. ములుగు, రంగారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

దేశవ్యాప్తంగా జోరుగా వానలు
ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీచేసింది. ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఏదైనా విపత్తు సంభవిస్తే వారిని తరలించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ నాలుగు సహాయక బృందాలను సిద్ధం చేసింది. ఈరోజు లేదంటే రేపు ఏర్పడే అల్పపడీనంతోపాటు ఆగస్టు మొదటివారంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అప్పటివరకు ముప్పు తప్పదని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications