'విదేశాలకు పరుగులు, ఇక్కడ హోదా వద్దని, అక్కడకెళ్లి టిడిపి నేతల పెట్టుబడి'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయాన్ని పక్కన పెట్టి మన నాయకులు విదేశాల వెంట పరిశ్రమల కోసం పరుగులు పెడుతున్నారని, అలాగే అధికార పార్టీ నాయకులు హోదా ఉన్న రాష్ట్రాలలో పెట్టుబడులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ గురువారం విమర్శించారు.
మోపిదేవి పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం పైన ఒత్తిడి చేయలేక, అభివృద్ధి పేరుతో మన పాలకులు ఇతర దేశాల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదాలో ఏమీ లేదంటూనే, అధికార పార్టీ నేతలు హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టి రాయితీలు పొందుతున్నారని, తద్వారా వారి డబుల్ స్టాండ్ కనిపిస్తోందని మండిపడ్డారు. ఓ వైపు పాలకులు లక్షల ఎకరాలు కబ్జా చేస్తున్నారని, మరోవైపు గ్రామాల్లో స్మశాన వాటికలకు కూడా స్థలాలు కేటాయించక పోవడం సిగ్గుచేటు అన్నారు.
మంత్రి పత్తిపాటి పుల్లారావు ఉన్న గుంటూరు జిల్లాలోనే నకిలీ విత్తనాలు జోరుగా విక్రయిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను సబ్సిడీ పైన అందించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications