రేషన్ వాహనాలపై ఇవాళ నిమ్మగడ్డ కీలక నిర్ణయం- ఎస్ఈసీ కార్యాలయంలో తనిఖీ తర్వాత
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై ప్రభుత్వం ముద్రించిన బొమ్మలు ఉండటంతో హైకోర్టు ఆధేశాల మేరకు వీటిని పరిశీలించాక ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రేషన్ డోర్ డెలివరీ వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీల్లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఈసీ పరిశీలన తర్వాత వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి వీటిని తనిఖీలు చేశాక తుది నిర్ణయం తీసుకోవాలని నిమ్మగడ్డ నిర్ణయించారు.

ఇవాళ ఉదయం రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయానికి తీసుకొస్తారు. అనంతరం వాటిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం వాటికి అనుమతిచ్చే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. తనిఖీల్లో ఇవి వైసీపీ ప్రచారానికి ఉపయోగపడతాయని భావిస్తే వాటిని నిలిపేసే అవకాశాలూ లేకపోలేదు. అప్పుడు తిరిగి హైకోర్టుకు ఇదే విషయం నివేదించి ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications