10 ఏళ్లలో 70 వేల కోట్లు: తాత్కాలిక సచివాలయం ఎక్కడంటే..!
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి-మల్కాపురం-మందడం గ్రామాలకు దక్షిణం వైపున నిర్మించాలని సీఆర్డీఏ ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో అమరావతి రాజధాని సలహా కమిటీతో భేటీ అయ్యారు.
మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 11 గంటల వరకు జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణంపై ఇప్పటివరకు జరిగిన కసరత్తు, భవిష్యత్తులో చేపట్టబోయే భవన నిర్మాణాలపై ఈ భేటీలో సమీక్షించారు. ఈ క్రమంలో తాత్కాలిక సచివాలయం ఎక్కడా అనే విషయం చర్చకు వచ్చింది.
ఈ నేపథ్యంలో సీఆర్డీఏ ఉన్నతాధికారులు తాత్కాలిక సచివాలయంపై చంద్రబాబుకు వివరించారు. తాత్కాలిక సచివాలయాన్ని సుమారు 20 ఎకరాల్లో 6 లక్షల చదరపుటడుగుల బిల్డప్ విస్తీర్ణంతో నిర్మించాలనే యోచనలో సీఆర్డీఏ ఉంది. అయితే దానిని ఎన్ని భవనాలుగా (4, 6 లేదా 8) నిర్మించాలనే విషయంలో కూడా ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఈ సమావేశంలో ప్రధానంగా నిధుల సమీకరణ, రైతులకిచ్చే ప్లాట్ల కేటాయింపు మొదలైన అంశాలపై చర్చించారు. నిధులు ఏవిధంగా సేకరించాలి, తక్కువ ఖర్చుతో భవనాలు ఏవిధంగా భవనాలు నిర్మించవచ్చు అనే విషయాలపై మెకన్సీ కంపెనీ చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది.
ఈ సందర్భంగా రాబోయే పదేళ్లలో సుమారు 70 వేల కోట్లను మౌలిక సదుపాయాల కల్పనకు సేకరించాలని ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం. సీడ్ క్యాపిటల్ పరిధిలో రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 35వేల నుంచి రూ.45 వేల కోట్ల ఖర్చవుతాయని మెకిన్సే వివరించింది.
సమావేశ అనంతరం కొందరు ఆరోపిస్తున్నట్టుగా తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలనుకోవడంలో ప్రభుత్వానికి రహస్య ఏజెండా ఏమీ లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలో మౌలిక సదుపాయాలను కల్పించిన తర్వాత మార్చి నాటికి రైతులకు ప్లాట్ల పంపిణీ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
తాత్కాలిక సచివాలయం నిర్మాణాలకు ఈనెల 8న టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications