గన్నవరం ఐటి పార్కు ఆంధ్రప్రదేశ్ సచివాలయం?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై వేగంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసే రోజుకల్లా ఎక్కడ రాజధాని నిర్మించాలనే దానిపై ప్రాథమిక అవగాహన రావటానికి ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి తాత్కాలిక క్యాంప్ కార్యాలయాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు.
అయితే సచివాలయం డిజిపి కార్యాలయం, అసెంబ్లీ భవనాలు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో ట్రాఫిక్‌కు అవరోధం కలగదని అనుకుంటున్నారు. మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్ ప్రాంగణంలో డిజిపి కార్యాలయం ఏర్పాటు చేయాలనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఇక తాజాగా తాత్కాలికంగా గన్నవరం విమానాశ్రయం ఎదుట దాదాపు 28 ఎకరాల్లో దివంగత వైఎస్ హయాంలో ఐటి పార్కుకు శ్రీకారం చుట్టారు.

ఎల్ అండ్ టి, ఎపిఐఐసి సంయుక్త భాగస్వామ్యంతో రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ టవర్‌ను 2010 జనవరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఐటి పార్క్ (మేధా టవర్స్)లో సచివాలయాన్ని తక్షణం ప్రారంభించవచ్చంటున్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ భవనంలో సచివాలయం ఏర్పాటుకు అనువుగా ఉంటుందంటూ విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ టవర్‌లో కేవలం ఎల్ అండ్ టి కంపెనీ ఒక్కడే పని చేస్తున్నది.
పైగా ఆశించిన మేర ఐటి కంపెనీలు ఇంకా రంగ ప్రవేశం చేయకపోవటంతో భవనం మొత్తం ఖాళీగా ఉంది. పైగా ప్రతి గదిలోనూ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. దీనికి కూతవేటు దూరంలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఆర్టీసీ జోనల్ శిక్షణ కేంద్ర భవనాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కృష్ణాజిల్లాకే చెందిన ఎంపి సుజనా చౌదరి నూజివీడు - ఆగిరిపల్లి పరిసరాల్లో రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. దీనికి అనుబంధంగా కృష్ణానదిపై మరో వంతెన నిర్మించి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించకుండానే ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించేలా ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మించవచ్చంటున్నారు. దీనికి ఏలూరు తర్వాత హైవేతో అనుసంధానం చేసే వీలుంది.
తొలుతగా సిఎం క్యాంప్ కార్యాలయం లేదా శాశ్వత ప్రాతిపదికన సచివాలయం ఏర్పాటు చేసుకోవాలనే ఆకాంక్ష చంద్రబాబులో కన్పిస్తోంది. అందుకే నమ్మకమైన పలువురి ద్వారా ఆరాతీయిస్తున్నారని వినికిడి. భవిష్యత్‌లో ఎప్పటికైనా కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచనతో ఉన్న ఈ జిల్లా టిడిపి నేతలు కీలకమైన రాజధానిని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయించడానికి వ్యూహరచన కావిస్తున్నారు. దీనికి సాధ్యమైనంతగా ప్రభుత్వంపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వ దేవాదాయ అటవీ భూములను యుద్ధప్రాతిపదికన సర్వే చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications