కేంద్రాన్ని ఇరుకునపెట్టిన వైసీపీ..! డీలిమిటేషన్ చర్చలో ఆ డిమాండ్..!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (delimitation 2026), మహిళా రిజర్వేషన్ల కల్పనపై ఇవాళ లోక్ సభలో జరుగుతున్న చర్చలో వైఎస్సార్సీపీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి (PV mithun reddy) మాట్లాడారు. ఇందులో ఆయన డీలిమిటేషన్ కు మద్దతిస్తూనే పలు సవరణలు కోరారు. అదే సమయంలో మరో డిమాండ్ ను కూడా మిథున్ తెరపైకి తెచ్చారు. దీంతో అధికార ఎన్డీయే ఇరుకున పడింది. అయితే దీనిపై వెంటనే వైసీపీకి ఎలాంటి హామీ లభించలేదు.
నియోజవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా లోక్‌సభలో వైయస్సార్‌సీపీ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి ప్రసంగించారు. ఇందులో నియోజకవర్గాల పునర్విభజనపై చట్టపరమైన హామీలు కావాలని ఆయన కోరారు. అలాగే మహిళల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్నారు. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా (special status) అన్నది రాష్ట్ర విభజన సమయంలో కేవలం ప్రకటనకే పరిమితం అయిందని, అప్పుడు ఆ అంశాన్ని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చలేదని, దీంతో అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని మిథున్ రెడ్డి కేంద్రానికి గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంట్‌లో ప్రకటించారని, అప్పటి ప్రతిపక్ష బీజేపీ కూడా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిందని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. ఆ రోజు వారు అలా నోటి మాటగా చెప్పారు, కానీ ఆ హామీని నిలబెట్టుకోలేక పోయారన్నారు. అందుకే నిన్నటి చర్చ సందర్భంగా హోం మంత్రి ఏదైతే నోటి మాటగా చెప్పారో దాన్ని బిల్లులో చేర్చాలని వైసీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. హోం మంత్రి చేసిన ప్రకటన చట్టబద్ధం కావాలంటే ఆ సవరణను ప్రభుత్వం ఆమోదించాలన్నారు.












Click it and Unblock the Notifications