ఏపీలో పదో తరగతి పరీక్షలు-విద్యార్ధులకు కీలక సూచనలు-నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులు చేయాల్సిన, చేయకూడని పనుల్ని అధికారులు తాజాగా సూచించారు.
ఏపీలో ఏప్రిల్ 3న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. వీటి కోసం ప్రభుత్వం ఎప్పటిలాగే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల్లో అక్రమాల నివారణకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా అధికారులు తాజాగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్దులు పాటించాల్సిన సూచనల్ని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తాయని వెల్లడించారు. కాబట్టి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు వారిని పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు.

అలాగే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చే అభ్యర్ధులు.. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. తీసుకొస్తే పరీక్షా కేంద్రాల్లోకి వారిని అనుమతించబోమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ సూచనల్ని తప్పకుండా పాటించాలన్నారు.
మరోవైపు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ పరీక్షలకు 12 పేజీలతో సమాధాన పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే పరీక్ష ముందుగానే రాసేసినా సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలులోనే ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ రోల్ నంబరు, పేరు లాంటి వ్యక్తిగత వివరాలను సమాధాన పత్రంలో రాయకూడదన్నారు. వాటిని కేవలం ఓఎంఆర్ షీటులోనే రాయాలి. విద్యార్థులు పెన్, పెన్సిల్, స్టేషనరీని వెంట తెచ్చుకోవచ్చు. పేపరు లీకేజీపై వదంతులు నమ్మొద్దని, అలాంటి ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే విద్యార్థులను తర్వాతి పరీక్షలకు అనుమతించబోమన్నారు. పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్ కోసం విద్యార్థులు తప్పనిసరిగా www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను రోజూ చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications