వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ మాక్ అసెంబ్లీ-వీరే స్పీకర్, మంత్రులు- అజెండా ఇదే
వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్ని ఒక్కరోజు పాటు మాత్రమే నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పటికే వీటిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అంతటితో ఆగకుండా వైసీపీకి కౌంటర్‌గా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రులు, స్పీకర్, విపక్ష నేత పేర్లను కూడా ప్రకటించింది. వీటితో పాటు రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల అజెండాను కూడా విడుదల చేసింది.

టీడీపీ మాక్ అసెంబ్లీ కౌంటర్
వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ఆమోదం కోసం ఇవాళ ఒక్క రోజు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ గుర్రుగా ఉంది. కేవలం ఒక్క రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ఎప్పుడూ లేదని, కరోనా పేరుతో సమావేశాల్ని కుదిస్తే బడ్జెట్‌పై చర్చకు అవకాశం లేకుండా పోతోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తద్వారా అసెంబ్లీలో తాము చెప్పాలనుకున్న విషయాల్ని మాక్ అసెంబ్లీ ద్వారా ప్రజల్లోకి పంపాలని భావిస్తోంది.

రెండు రోజుల మాక్ అసెంబ్లీ అజెండా
వైసీపీ సర్కారు బడ్జెట్ సమవేశాల కోసం ఒక్కరోజు పాటు అసెంబ్లీ నిర్వహిస్తుండగా.. దీనికి కౌంటర్‌గా టీడీపీ మాక్ అసెంబ్లీని రెండు రోజుల పాటు నిర్వహించబోతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఆరున్నర వరకూ, అలాగే రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ టీడీపీ మాక్ అసెంబ్లీ నిర్వహించనుంది. ఈ మేరకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. తొలి రోజు కరోనాపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనుండగా, ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగులు ప్రదర్శిస్తామని టీడీపీ తెలిపింది. దీనిపై దువ్వారపు రామారావు సమాధానం తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష నేత ప్రసంగిస్తారు. రెండో రోజైన రేపు ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, దిశ బిల్లు పేరుతో మోసం, పింఛను పెంపులో మోసం, ధరల పెరుగుదల, కార్పొరేషన్ల పేరుతో మోసం వంటి అంశాలను ప్రస్తావించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.

టీడీపీ మాక్ అసెంబ్లీ మంత్రులు వీరే
రెండు రోజుల పాటు జరిగే టీడీపీ మాక్ అసెంబ్లీకి స్పీకర్‌గా ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి వ్యవహరిస్తారు. మంత్రులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తారు. ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్ శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రిగా వ్యవహరించనుండగా, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా దువ్వారపు రామారావు, పౌరసరఫరాల మంత్రిగా వైవీబీ రాజేంద్రప్రసాద్, జలవనరుల శాఖ మంత్రిగా బుద్ధా వెంకన్న, దేవాదాయ శాఖ మంత్రిగా బుద్ధా నాగజగదీశ్, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ వ్యవసాయం, గద్దే రామ్మోహన్ హోంశాఖ మంత్రులుగా వ్యవహరిస్తారు. జీరో అవర్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications