రాహుల్ గాంధీ టీమ్ లో టీడీపీ,జనసేన, బీజేపీ ఎంపీలు..?
ఏపీలో, కేంద్రంలో కలిసి పోటీ చేసిన ఎన్డీయే కూటమి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఏపీలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ ముగ్గురు ఎంపీల్ని గెల్చుకుంది. అలాగే జనసేన ఇద్దరు ఎంపీల్ని, టీడీపీ మరో 16 ఎంపీల్ని గెల్చుకుంది. దీంతో కేంద్రంలో ఇప్పుడు ఏపీ నుంచి 21 మంది ఎన్డీయే ఎంపీలు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఓ కీలక పార్లమెంటరీ కమిటీకి ఎంపికయ్యారు.
విపక్ష నేత రాహుల్ గాంధీ ఛైర్మన్ గా లోక్ సభ 18వ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)ని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ నుంచి ముగ్గురు ఎన్డీయే ఎంపీలకు చోటు దక్కింది. ఏపీలో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కొక్క ఎంపీకి ఇందులో చోటు కల్పించారు. వీరిలో ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారు. 15 మంది సభ్యులతో ఉన్న ఈ కమిటీలో ముగ్గురు ఏపీ వారే ఉండటం విశేషం.

ఏపీ ఎన్డీయే ఎంపీలు కాకుండా ఈ కమిటీలో ఇంకా టీఆర్ బాలు, నిషికాంత్ దూబే, జగదంబికా పాల్, రవిశంకర్ ప్రసాద్, త్రివేంద్ర సింగ్ రావత్, ప్రొఫెసర్ సౌగత రాయ్, అపరాజితా సారంగి, డాక్టర్ అమర్ సింగ్, తేజస్వి సూర్య, అనురాగ్ ఠాకూర్, కేసీ వేణుగోపాల్, ధర్మేంద్ర యాదవ్ ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ ఉండబోతోంది. ఏప్రిల్ 30 తర్వాత మరో కమిటీ ఎన్నిక ఉంటుంది. వాస్తవానికి ఈ కమిటీలో సభ్యత్వం కోసం మరో నలుగురు ఎంపీలు కూడా పోటీ పడినా చివరి నిమిషంలో వారు తప్పుకోవడంతో ఏకగ్రీవమైంది.












Click it and Unblock the Notifications