Shaik Sabji: రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం-కార్లు ఢీకొన్న ఘటనలో..
ఏపీ ఉపాధ్యాయ కోటా శాసనమండలి సభ్యుడు షేక్ సాబ్జీ ఇవాళ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సాబ్జీ ఏలూరు నుంచి భీమవరానికి కారులో వెళ్తుండగా... మరో కారు ఢీకొనడంతో ఆయన అక్కడిక్కడే చనిపోయారు. దీంతో ఉపాధ్యాయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చనిపోయారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతదేహాన్ని భీమవరం హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ భీమవరం హాస్పిటల్ కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పోస్టు మార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా రెండోసారి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఉపాధ్యాయ సమస్యలపై చురుగ్గా పోరాడారనే పేరుంది.

ఇవాళ ఉదయం అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం తిరిగి వెళ్తుండగా చెరుకువాడలో ఎదురుగా వచ్చిన కారు షేక్ సాబ్జీ కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాదానికి వాస్తవ కారణం ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు వెంటనే ఘటనా స్ధలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధ్యాయ సమస్యలపై మండలిలో బలంగా వాణిని వినిపిస్తారని పేరున్న షేక్ సాబ్జీ మరణంపై ఉపాధ్యాయ వర్గాలు షాక్ లో మునిగిపోయాయి. ఘటనపై ఆరా తీసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications