పీఆర్సీ కోసం మరో ఐక్యవేదిక - ఉద్యమ కార్యాచరణ ఇలా : సీఎంకు బహిరంగ లేఖ..!!
ఏపీలో పీఆర్సీ సాధన కోసం మరో ఐక్య వేదిక సిద్దమైంది. ప్రభుత్వ ఉద్యగ సంఘాలు జేఏసీగా ఏర్పడి.. పీఆర్సీ సాధన సమితిగా సమ్మెకు గతంలో పిలుపునిచ్చారు. గత వారం ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితం గా వారు సమ్మె నిర్ణయం విరమించుకున్నారు. వారితో విభేదించిన కొన్ని సంఘాలు ఇప్పుడు పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో కొత్త జేఏసీని ఏర్పాటు చేసారు. ఇందు కోసం పీఆర్సీకి న్యాయం చేయాలనే డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక ఏర్పాటైంది. విజయవాడలో పీఆర్సీ అంశం పైన 34 ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.

సుదీర్ఘ చర్చలు.. కార్యాచరణ ఖరారు
పీఆర్సీలోని అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ఐక్యవేదికను ఏర్పాటుచేశారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకించారు. ఫిట్‌మెంట్ 27% కంటే ఎక్కువ ఇవ్వాలని, గ్రాట్యుటీని 2020 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని, సీపీఎస్ రద్దు, ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండు చేశారు. పీఆర్సీ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఇందు కోసం తమ కార్యాచరణను సైతం ఖరారు చేసాయి.

ఎమ్మెల్సీల మద్దతు..డిమాండ్లు ప్రస్తావన
ఐక్యవేదిక ఉద్యమానికి ఏడుగురు పీడీఎఫ్, స్వతంత్ర ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. సీఎం జగన్ చర్చలకు పిలిచి, డిమాండ్లు నెరవేర్చాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి మార్చి 8వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. పీఆర్సీపై ఉద్యోగుల అసంతృప్తిని తెలుసుకునేందుకు బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. మార్చి 2, 3 తేదీల్లో జిల్లా స్థాయి, 7, 8 తేదీల్లో రాష్ట్రస్థాయిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు. పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవని నేతలు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై పీఆర్సీపై పునఃసమీక్షించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసారు. ఎన్ని ఆంక్షలు విధించినా ముందుకే వెళ్తామని ప్రకటించారు.

సీఎం జగన్ కు బహిరంగ లేఖ ద్వారా
సమావేశంలో నిర్ణయించిన కార్యాచరణ మేరకు..ఈ నెల 14, 15 తేదీల్లో ఐక్యవేదిక సభ్యులను చర్చలకు పిలవాలని సీఎం జగన్‌కు వినతులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యాచరణ నోటీసు సమర్పించాలని నిర్ణయించారు. 15 నుంచి 20 వరకు పీఆర్సీపై పునఃసమీ క్షించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 21-24 వరకు పీఆర్సీపై అభిప్రాయాల సేకరణ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పీఆర్సీపై వినతుల సమర్పించాలని నిర్ణయించారు. 25న చర్చలకు పిలవాలని ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు.