రెండేళ్లలో హైద్రాబాద్ టు అమరావతి: ఫ్యాబ్రిక్ బిల్డింగ్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిని మంగళగిరి నుండి అమరావతికి మార్చే యోచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం ఏడాదిలో భవనాలు నిర్మించడం, రెండేళ్లలో ఉద్యోగులను తరలించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుండి పని చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడి నుండి పాలించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో ఉండేందుకు ఏపీకి పదేళ్ల పాటు అవకాశముంది. కానీ సొంత రాష్ట్రం నుండి పాలిస్తేనే బాగుంటుందని భావిస్తోంది.

మరోవైపు, పూర్తిస్థాయి రాజధానిని నిర్మించేందుకు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక రాజధానితో పాలన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిని తాత్కాలిక రాజధానిని చేయాలని తొలుత యోచించారు.
అయితే, అమరావతిని తాత్కాలిక రాజధాని చేసుకోవాలని ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని సమాచారం. అధికారులు మంగళవారం నాడు అమరావతిలో కొన్ని భవనాలను పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ నుండి రాగానే తాత్కాలిక రాజధానిపై సమావేశం కానున్నారని తెలుస్తోంది.
ప్రభుత్వానికి చెందిన కీలక కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. కార్యాలయాల కోసం తాత్కాలికంగా ఫ్యాబ్రికేటెడ్ భవనాలు నిర్మించాలని భావిస్తున్నారు. ఏడాదిలో ఈ భవంతులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications