ఏపీలో పట్టణాలకు మహర్దశ.. రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణాల రూపురేఖలు మార్చేలా భారీ అభివృద్ధి పనులకు నేడు కీలక అడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM విధానంలో ప్రారంభించారు.
రాష్ట్రంలో తొలిసారి ఇంత విస్తృత స్థాయిలో HAM మోడల్లో చేపట్టిన పట్టణ అభివృద్ధి కార్యక్రమంగా చెప్పవచ్చు. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లోని 106 నియోజకవర్గాలకు చెందిన 123 మున్సిపాలిటీల్లో ఈ పనులు ఏకకాలంలో మొదలవుతున్నాయి. ఏపీలోని పట్టణాలలో రోడ్ల అభివృద్ధికి రూ.4,656 కోట్లు, సెంట్రల్ మీడియన్లకు రూ.88 కోట్లు, స్ట్రీట్ లైటింగ్‌కు రూ.247 కోట్లు, పార్కులకు రూ.509 కోట్లు కేటాయించారు.

దీంతో సుమారు 2,165 కిలోమీటర్ల రోడ్లు, 502 పార్కులు, 210 కిలోమీటర్ల మీడియన్లు, 391 కిలోమీటర్ల వీధి దీపాలు, 300కిలోమీటర్ల సీవరేజ్ పనులు పూర్తికానున్నాయి. పట్టణ స్థానిక సంస్థలపై ఆర్థిక భారం పడకుండా HAM విధానం ద్వారా ప్రభుత్వం, ప్రైవేట్ పెట్టుబడులతో పనులు చేపడతారు. సీఎం చంద్రబాబు కుప్పం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పట్టణాల్లో రోడ్లు, లైటింగ్, పార్కులు, పారిశుధ్యం మెరుగుపరచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. కుప్పం నియోజకవర్గం కడపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమన్నారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మున్సిపల్ శాఖ మంత్రి, అధికారులను అభినందించారు.
రెండేళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని అభివృద్ధి దిశగా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న పనులతో కలిపి రూ.50 వేల కోట్ల పనులకు ప్రతిపాదనలు చేశామని, ఇవి పూర్తయితే రాష్ట్రం దశ దిశ మారుతుందని అన్నారు. ఇప్పటికే రూ.22,330 కోట్ల పనులు కొనసాగుతున్నాయని, మరో ఆరు నెలల్లో రూ.17 వేల కోట్ల పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రూ.7,496 కోట్ల పనులు చేపడుతున్నామన్నారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలోనే రూ.3,890 కోట్ల పనులు జరుగుతాయని, రోడ్లు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, సీవరేజ్ పనులపై ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. 2027 నాటికి టిడ్కో గృహాలు పూర్తి చేస్తామని, విశాఖలో 28,500 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని వెల్లడించారు.













Click it and Unblock the Notifications
