రేపు స్కూళ్లకు సెలవు! ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొన్ని గంటలుగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతున్న ఈ రుతుపవన ద్రోణి, రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. ఇది సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది కళింగపట్నానికి ఆగ్నేయంగా 200 కి.మీ, విశాఖపట్నానికి తూర్పుగా 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఉత్తరాంధ్రలో కుండపోత వానలు.. ఎల్లో, రెడ్ అలర్ట్‌లు
వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం భీకరంగా మారింది. పిడుగులు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి

శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు.. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
భారీ వర్షాల దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు రేపు (సెప్టెంబర్ 23న) సెలవు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకలు ఉన్న గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంత వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రవాణా, విద్యుత్ వ్యవస్థలకు విఘాతం.. అధికారుల సూచనలు
వర్షాల ధాటికి రోడ్లపై భారీగా నీరు నిలవడం, లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో పాటు చాలా చోట్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ముప్పుంది. పిడుగుపాట్లు, బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున విద్యుత్ రవాణా, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెరువులు, డ్యామ్‌లు ఉప్పొంగే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దని, ప్రమాదకర చెట్లు, విద్యుత్ లైన్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
