స్మార్ట్ సిటీగా నల్గొండ.. అభివృద్ధి పనులపై మంత్రి తీపికబురు!
స్మార్ట్ సిటీగా నల్గొండ మారుతుంది. నల్గొండ రూపురేఖలు మార్చటానికి సీఎం రేవంత్ సహకారంతో ఎంతో కృషి చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడమే కాక కేంద్రం నుంచి మరిన్ని బెస్ట్ కార్పోరేషన్ అవార్డులు కూడా అందుకుంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ తర్వాత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నల్లగొండ అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉన్నామని మంత్రి తెలిపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోనీ క్యాంపు కార్యాలయం వద్ద నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిశుభ్రతకు సంబంధించి కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు వెట్టింగ్ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నల్లగొండ ను ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

నగరంలో 24 గంటలు తాగునీరు అందించేందుకు 83 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్లు కూడా పిలవడం జరిగిందన్నారు. నల్గొండ కార్పొరేషన్లో ఎస్ డి ఎఫ్ నిధులతో 63 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని, అలాగే తక్కిన డివిజన్లలో కూడా రోడ్లతో పాటు, డ్రైన్లు నిర్మిస్తామని, 6 నెలల్లో ఎస్టిపి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ కు అన్ని రకాల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసి ఉత్తమ కార్పోరేషన్ అవార్డు కూడా తీసుకుంటామనే నమ్మకం తనకున్నట్టు మంత్రి తెలిపారు.
నల్గొండ కార్పొరేషన్ ఇటీవల స్వచ్ఛ అవార్డు అందుకుందని మంత్రి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ ఇటీవల క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించి కేంద్ర ప్రభుత్వం నుంచి డిల్లీలో అవార్డు కూడా అందుకుందని ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తూ, పట్టణాన్ని చెత్త రహిత నగరంగా తీర్చి దిద్ది మరిన్ని జాతీయ స్థాయి అవార్డులు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
నల్లగొండ నగరంలో భారీ వాహనాల వచ్చే శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పట్టణ పరిధిలో 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, అలాగే డ్రైనేజీ, ఎస్ టి పి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సదుపాయాలతో నల్లగొండ మోడరన్ ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.













Click it and Unblock the Notifications
