andhra pradesh Coronavirus new delhi amaravathi centre Corona Vaccine ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ అమరావతి కేంద్రం హర్షవర్ధన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత, రేపటికి నిల్: స్పందించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కోటి కరోనా వ్యాక్సిన్ డోసులు కావాలంటూ కేంద్రాన్ని కోరింది ఏపీ సర్కారు. తక్షణమే కోటి వ్యాక్సిన్ డోసులను పంపించాలని విజ్ఞప్తి చేసింది.


గురువారం నాటికి ఏపీలో కరోనా వ్యాక్సిన్ నిల్..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3.7 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, అయితే, ప్రతి రోజు 1.3 లక్షల డోసులను ప్రజలకు వేస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత చాలా ఉందని పేర్కొన్నారు. గురువారం నాటికి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తిగా లేకుండా అయిపోతాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోందని చెప్పారు. ఇప్పటికే నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తిగా అయిపోయాయని సదరు అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు మహారాష్ట్రలోనూ మరో మూడ్రోజుల్లో కరోనా వ్యాక్సిన్ నిల్వ లేకుండా పోతుంది.

కరోనా వ్యాక్సిన కొరత లేదంటూ కేంద్రమంత్రి హర్షవర్ధన్..
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏ మాత్రం లేదని అన్నారు. ఆయా రాష్ట్రాలు కోరిన సంఖ్యలో తాము కరోనా వ్యాక్సిన్లను పంపిస్తూనే ఉన్నామని తెలిపారు. ఏ రాష్ట్రానికీ వ్యాక్సిన్ కొరత రానివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు అవసరమైనన్నీ కరోనా వ్యాక్సిన్లను అందిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు అవసరమైనన్నీ కరోనా వ్యాక్సిన్లను వెంటనే పంపిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 45ఏళ్లకుపైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.

దేశంలో కరోనా కల్లోలం.. మహారాష్ట్రలోనే అత్యధికం
కాగా, దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లోనే 1.15 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. మూడు రోజుల్లోనే లక్షకుపైగా కరోనా కేసులు రెండోసారి నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు 1,66,177 కరోనా మరణాలు సంభవించాయి. ఒక్క మహారాష్ట్రలోనే గత కొద్ది రోజులుగా అరలక్షకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య బృందాలు తరలివెళ్లాయి.