గ్రామ వార్డు సచివాలయాల శాఖ రద్దు..! ఉద్యోగుల షాకింగ్ డిమాండ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్దలో భాగంగా ఉన్న ఉద్యోగులు కీలక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ రద్దు చేసి ఉద్యోగులను మాతృ శాఖలతో పాటు మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి.జాని పాషా కోరారు.
గ్రామ వార్డు సచివాలయాల శాఖ కేవలం ఉద్యోగులను కట్టు బానిసలుగా,రోజు కూలీల మాదిరిగా వెట్టి చాకిరీ చేయించడం కోసం మాత్రమే సమన్వయం చేసే శాఖగా మాత్రమే పనిచేస్తుంది తప్ప ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలమైందని వారు వాపోయారు. అలాగే అవసరం లేని ప్రత్యేక శాఖ నిర్వహణ వలన ప్రభుత్వపై ప్రతి ఏడాది నిర్వహణ ఖర్చు పెరిగిపోతుందన్నారు. అలాగే శాశ్వత సచివాలయ ఉద్యోగులు ఉండగా నిర్వహణ కోసం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు , రాష్ట్ర స్థాయిలో ఒప్పంద ఉద్యోగులు ఈ శాఖలో పనిచేయడం కూడా ప్రభుత్వానికి వృధా ఖర్చు అన్నారు.

దీంతో పాటు సచివాలయాలలో పనిచేస్తున్న లక్షా 30 వేల మంది ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగులు అనే ఒకే ఒక్క కారణం ద్వారా సమాజంలో కనీసం ఆత్మ గౌరవం లేకుండా పోతుందని, వ్యవస్థ ఏర్పడి ఆరు సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వ పరిధిలోని కొందరు అధికారులు, కొందరు సీనియర్ ఉద్యోగులలో, సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు అంటే ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా చిన్న చూపుతో వివక్షకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు ఎక్కడ ఏ పనికి అవసరం అయితే అక్కడ తమను వాడుకుంటున్నారు తప్ప ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదని వారు తెలిపారు. ఉద్యోగుల సమస్యల గురించి సచివాలయాల శాఖ ఏ మాత్రం దృష్టి సారించకపోగా కేవలం ఎవరికి అవసరం అయితే వారికి మ్యాన్ పవర్ సప్లై కంపెనీ మాదిరిగా తయారైందన్నారు. ఉద్యోగులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని, క్షేత్ర స్థాయి అధికారులు కనీసం పండుగలు, సెలవులు, ఆదివారలలో సైతం పని ఒత్తిడితో ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ కనీసం కుటుంబాలతో గడిపే సమయం కూడా ఇవ్వడం లేదని ఎన్నిసార్లు సచివాలయాల శాఖ దృష్టికి తీసుకొని వెళ్ళినా ప్రయోజనం లేదన్నారు.

నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు,ప్రొబేషన్ ఆలస్యం అయిన కాలానికి బకాయిల చెల్లింపులు గురించి,రికార్డు అసిస్టెంట్ క్యాడర్ ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు మార్పు చేయడం, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్, పదోన్నతులు, మాతృ శాఖలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన ఉద్యోగుల బదిలీలు, సమయపాలన లేని పని వత్తిడి వంటి ప్రధాన అంశాలపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సచివాలయాల శాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని జేఏసీ మండిపడింది.
ఉద్యోగులను మాతృ శాఖల్లో విలీనం చేయడం లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా ఒకే శాఖ పరిధిలో ఎంత పనైనా సులువుగా చేయవచ్చని అదే సచివాలయాలలో అయితే ప్రతి శాఖ పనికి ఒక ఉద్యోగి పై అనేక శాఖల అధికారుల అజమాయిషీ వలన ఉద్యోగులు తీవ్ర మానసిక వత్తిడికి గురై సరికొత్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మతిమరుపు,చిరాకు,తీవ్రమైన కోపం,భరించలేని తలనొప్పి,షుగర్,హైబి.పి,హార్ట్ ఎటాక్,నరాల వ్యాధులతో పాటు తీవ్రమైన పక్షవాతం వంటి సమస్యలకు గురి అవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కరలేని గ్రామ వార్డు సచివాలయాల శాఖను రద్దు చేసి ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని జేఏసీ కోరింది.












Click it and Unblock the Notifications